పూల బొకేలకు బదులు నోట్‌బుక్స్: విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేసిన ‘సానా సతీష్ బాబు ఫౌండేషన్’!
అమరావతి: కాకినాడలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చేపట్టిన వినూత్న కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా నాయకులను కలిసేటప్పుడు పూల బొకేలు తీసుకురావడం ఆనవాయితీ. అయితే, దానికి భిన్నంగా తనను కలిసేందుకు వచ్చే వారు పూల బొకేలకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ తీసుకురావాలని ఎంపీ సానా సతీష్ బాబు పిలుపునిచ్చారు. ఈ విన్నపానికి నాయకులు, కార్యకర్తలు , అభిమానుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.
3000 నోట్‌బుక్స్ పంపిణీ:
ఈ విధంగా సేకరించిన దాదాపు 3000 నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ , ఎగ్జామ్ ప్యాడ్లను ‘సానా సతీష్ బాబు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఇవాళ నగరంలోని ప్రజావిద్యాలయం , ఎంపీపీఎస్ ప్రైమరీ మోడల్ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయ ప్రతినిధులు , ఫౌండేషన్ సభ్యులు పాల్గొని విద్యార్థులకు వీటిని అందజేసి, వారి విద్యాభ్యాసానికి తమ మద్దతును తెలిపారు.
భవిష్యత్తుకు పునాది:
పూల బొకేలు కేవలం కొన్ని క్షణాల ఆనందాన్ని మాత్రమే ఇస్తాయని, అదే ఒక నోట్‌బుక్ విద్యార్థి భవిష్యత్తుకు పునాదిగా మారుతుందని ఫౌండేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విద్య, ఆరోగ్యం , సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తలాటం హరీష్, ఎంపీ కార్యాలయ ఇంఛార్జ్ మేకా లక్షణమూర్తి, ఆనంద్ న్యూటన్, ముమ్మిడి వెంకటేశ్వర రావు, ఎంపీ వ్యక్తిగత సహాయకులు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.








