ఏపీలో ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం : మంత్రి లోకేష్
పుంగనూరులో ఈవీ క్లస్టర్, ప్రతి 30 కి.మీ.లకు ఒక ఛార్జింగ్ స్టేషన్
ఈవీ మాగ్నెట్ ల కోసం కేంద్రం సహకారంతో రేర్ ఎర్త్ కారిడార్
కియా, శ్రీసిటీ సమీపంలో ఆటో కాంపోనెంట్ పార్క్ ల అభివృద్ధి
కొరియా ఆటో ఇండస్ట్రీస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
సియోల్ (సౌత్ కొరియా): సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్ లో విస్తృతమైన ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం, ఇందులో కొరియన్ సంస్థలు భాగస్వామ్యం వహించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ (KAICA) ఛైర్మన్ టేక్-సుంగ్ లీ (Mr. Taek-sung Lee) నేతృత్వంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధిలో భాగంగా పూర్తి ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ విద్యుదీకరణ, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్లు, ఈ-మొబిలిటీ నగరాలకు ఈవీ ఆర్&డీ గ్రాంటు, పుంగనూరు ఈవీ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈవీ మాగ్నెట్ల కోసం ఏపీలో కేంద్రప్రభుత్వ సహకారంతో రేర్ ఎర్త్ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. చెన్నె-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో 100 కి.మీ.ల పరిధిలో ఆటోమోటివ్ విడిభాగాల ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తున్నాం, ఇందులో కియా, దాని అనుబంధ సంస్థలతోపాటు అశోక్ లేలాండ్, ఇసుజీ మోటార్స్, హీరో మోటో కార్ప్, అమర్ రాజా, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ వంటి ప్రధాన సంస్థలు అంతర్భాగంగా ఉన్నాయని చెప్పారు. అశోక్ లేలాండ్ సంస్థ ₹2,500 కోట్లతో లిథియం అయాన్ ఈ-బస్ ప్లాంట్ ఏర్పాటుచేస్తోందని తెలిపారు.
కియా విజయగాథ మా కమిట్ మెంట్, శక్తి, సామర్థ్యాలకు నిదర్శనం. కియా క్లస్టర్ (అనంతపురం) సమీపాన ఒకటి, శ్రీసిటీ–చిత్తూరు–తిరుపతి కారిడార్ వెంబడి మరొక ప్రత్యేక కొరియన్ ఆటో కాంపోనెంట్స్ పార్క్ లు అభివృద్ధి చేస్తాం, ఇక్కడ ప్లగ్ అండ్-ప్లే షెడ్లు, ఉమ్మడి టూలింగ్/టెస్టింగ్ సౌకర్యాలు, పూర్తిస్థాయి సదుపాయాల కోసం ఒక కొరియా డెస్క్ ఏర్పాటుచేస్తామన్నారు. APSSDC ద్వారా పరిశ్రమకు అనుగుణంగా రూపొందించిన ప్రోగ్రామ్‌లు, కౌశలం ప్లాట్‌ఫామ్, సభ్య కంపెనీలతో కలిసి ప్రెస్/బాడీ/పెయింట్-షాప్ ఆపరేషన్స్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారీలో కీలకపాత్ర వహిస్తున్నాయి. EV పవర్ట్రెయిన్ల కోసం అకాడమీని ఏర్పాటుచేసి, కొరియన్-స్థాయి ఆటో నైపుణ్య శిక్షణకు కొరియన్ సంస్థలు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇందుకోసం ఏపీలోని 250కి పైగా ఇంజనీరింగ్ కళాశాలల సహకారం తీసుకోండి. దక్షిణ కొరియాతో ఆంధ్రప్రదేశ్ సంబంధాన్ని మరింత పటిష్టం చేస్తూ, APEDBలో కొరియా డెస్క్, ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుచేస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.








