ఏపీ-కొరియా భాగస్వామ్యంలో మరో అధ్యాయాన్ని లిఖించబోతున్నాం : మంత్రి లోకేష్
పెట్టుబడిదారులతో శాశ్వత భాగస్వామ్యాలు నిర్మించడమే మా లక్ష్యం
కొరియాతో ఆంధ్రప్రదేశ్ ది విజయవంతమైన భాగస్వామ్యం
ఏపీ పట్ల విశ్వాసానికి కియా మోటార్స్ పెట్టుబడి నిదర్శనం
కొరియా మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీని తీర్చిదిద్దుతాం
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ మా విజయ రహస్యం
ఏపీ అభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వామ్యం కావాలి
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కొరియా రోడ్ షోలో మంత్రి లోకేష్ పిలుపు
సియోల్ (సౌత్ కొరియా): ఏపీ-కొరియా భాగస్వామ్యంలో మరో అధ్యాయాన్ని లిఖించబోతున్నాం. పెట్టుబడిదారులతో శాశ్వత భాగస్వామ్యాలు నిర్మించడమే మా లక్ష్యం. కొరియాతో ఆంధ్రప్రదేశ్ ది విజయవంతమైన భాగస్వామ్యం. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వామ్యం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్ లో 31వ సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్ట్ నర్ షిప్ సమ్మిట్ సౌత్ కొరియా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రోడ్ షో లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సియోల్‌లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ మీ మధ్య ఉండటం ఎంతో గౌరవంగా ఉంది. అంతకంటే ముఖ్యంగా, ఇప్పటికే వేలాది మంది జీవితాలను మార్చిన, భవిష్యత్తులో ఆసియాలో అత్యంత కీలకమైన ఆర్థిక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచే సామర్థ్యం ఉన్న ఈ భాగస్వామ్యానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ముందుగా నా గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నా. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అయితే గత రెండేళ్లుగా నాకు మరో ప్రధాన బాధ్యత కూడా ఉంది. అదే ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడులు, సాంకేతికత, ఉపాధి అవకాశాలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం.
పెట్టుబడిదారులతో శాశ్వత భాగస్వామ్యాలు నిర్మించడమే మా లక్ష్యం
2024లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నా లక్ష్యం ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం… ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం. గత రెండేళ్లలో దావోస్, సింగపూర్, జపాన్, రష్యా, మధ్యప్రాచ్యం, యూరప్, ఇప్పుడు కొరియా వంటి అనేక దేశాల్లో పర్యటించాం. మా లక్ష్యం కేవలం ఎంవోయూలు కుదుర్చుకోవడం మాత్రమే కాదు… శాశ్వతంగా నిలిచే భాగస్వామ్యాలను నిర్మించడం మా లక్ష్యం. ఈ పర్యటనలో నా కొరియా మిత్రుల్లో ఒకరు నాకు ఇచ్చిన ప్రశంసను ఎంతో విలువైనదిగా భావిస్తున్నా. ఆయన నన్ను ‘పల్లి పల్లి మంత్రి’ అని పిలిచారు. కొరియన్ భాషలో ‘పల్లి పల్లి’ అంటే ‘త్వరగా… త్వరగా’(వేగవంతమైన) అని అర్థం. అదే విధంగా మా ప్రభుత్వం కూడా పనిచేయాలని మేం కోరుకుంటున్నాం.
కొరియాతో ఆంధ్రప్రదేశ్ ది విజయవంతమైన భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణంగా పనిచేయాలనేది మా నమ్మకం. ఫైళ్లు టేబుళ్లపై నిలిచిపోకూడదు. పెట్టుబడిదారులు కార్యాలయాల కారిడార్లలో వేచి చూడకూడదు. అనుమతుల కోసం అవకాశాలు ఆలస్యం కాకూడదు. మా ప్రభుత్వాన్ని నిర్వచించేది ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’. బహుశా అందుకే నాకు కొరియాలో సొంత ఇంటి వాతావరణం కనిపిస్తోంది. కొరియాతో మా సంబంధం కొత్తది కాదు. ఈరోజు ఏపీలో 35కి పైగా కొరియా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఏపీ పట్ల విశ్వాసానికి కియా మోటార్స్ పెట్టుబడి నిదర్శనం
2016లో కియా మోటార్స్ ఏపీలో పెట్టుబడి పెట్టాలనే ధైర్యవంతమైన నిర్ణయంతో మా ప్రయాణం ప్రారంభమైంది. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడం కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు. అది మాపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. అతి తక్కువ కాలంలోనే అనంతపురంలోని కియా ప్లాంట్ ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకు అత్యుత్తమ ఉత్పాదకత కలిగిన తయారీ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామం మరింత ముఖ్యమైంది. కియా ఒంటరిగా రాలేదు. కియాతో పాటు మొత్తం ఎకో సిస్టమ్ ను తీసుకువచ్చింది. ఈరోజు అనంతపురం భారతదేశంలోని అత్యంత విజయవంతమైన కొరియన్ ఆటోమొబైల్ క్లస్టర్లలో ఒకటిగా ఎదిగింది.
కొరియా భాగస్వామ్యంతో పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ నిర్మించడమే లక్ష్యం
ఇప్పుడు మేం రెండో అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో తన మూడో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం శ్రీసిటీని ఎంపిక చేసింది. నిర్మాణ పనులు వేగంగా జరగుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఈవీ కాంపోనెంట్స్, ఫుట్ వేర్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో కూడా కొరియా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ పర్యటన మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, భారీ పరిశ్రమలు, సముద్ర పరికరాలు, స్టార్టప్‌ల రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్-కొరియా మధ్య భాగస్వామ్యం కేవలం ఒక కంపెనీ గురించి కాదు.. పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ నిర్మించడమే మా లక్ష్యం.
కొరియా మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీని తీర్చిదిద్దుతాం
ఇటీవల భారత్ లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ జరిపిన పర్యటన ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. రెండు దేశాల ప్రభుత్వాలు వచ్చే దశాబ్దానికి జాయింట్ స్ట్రాటజిక్ విజన్ ను ఆమోదించడం జరిగింది. ఇకపై ఈ సంబంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాదు. సెమీకండక్టర్లు, ఏఐ, అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్, షిప్ బిల్డింగ్, మారిటైం సెక్యూరిటీ, క్రిటికల్ మినరల్స్, క్లీన్ ఎనర్జీ, ట్రస్టెడ్ సప్లై చెయిన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం భారత్-కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 27 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి దీన్ని 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని రెండు దేశాల ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆ లక్ష్యాన్ని మనం సాధించడమే కాకుండా అధిగమిస్తామని కూడా నమ్ముతున్నా. ఈ వృద్ధిలో ఏపీ కూడా ముఖ్య భూమిక పోషించాలని కోరుకుంటోంది. కేవలం భారతదేశంలోని మరో రాష్ట్రంగా కాకుండా.. భారతదేశంలోకి కొరియా పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యమైన మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ గేట్ వేగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతం
పెట్టుబడులకు ఏపీనే ఎందుకు ఎంచుకోవాలనేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 190 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ఏటా దాదాపు 21 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసే భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం, అనేక నౌకాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విశ్వసనీయ విద్యుత్ సరఫరా, అనువైన భూమి ధరలు, యువతతో కూడిన నైపుణ్యవంతమైన మానవ వనరులు, ప్రకటనల కంటే అమలుకే అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం.. ఏపీ బలాలుగా ఉన్నాయి. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, షిప్ బిల్డింగ్, డేటా సెంటర్లు, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ డ్ మెటీరియల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్ వంటి రేపటి పరిశ్రమలను మేం నిర్మిస్తున్నాం. కొరియా సాంకేతిక నైపుణ్యం.. ఆంధ్రప్రదేశ్ విస్తృత సామర్థ్యంతో కలిసినప్పుడు అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని మేం విశ్వసిస్తున్నాం.
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ మా విజయ రహస్యం
ఏపీ ప్రత్యేకతల గురించి చాలా మంది అడుగుతారు. అందుకు మూడు ‘ఎస్’ లు ప్రధాన కారణాలుగా చెబుతాను. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్. ప్రతి విజయవంతమైన పెట్టుబడి గమ్యస్థానం వెనుక ఒక సమర్థవంతమైన పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ ఉంటుంది. మా వద్ద అది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (EDB). భారతదేశంలోని అత్యుత్తమ పెట్టుబడి ప్రోత్సాహక సంస్థల్లో ఇదొకటి. మా యువ, ఉత్సాహభరితమైన బృందం పరిశ్రమలతో పాటు వివిధ రాష్ట్రాల పెట్టుబడి ప్రోత్సాహక సంస్థల నుంచి వచ్చిన నిపుణులతో ఏర్పడింది. త్వరలో మరికొంతమందిని కూడా చేర్చుకోబోతున్నాం. వారు ఎక్కడి నుంచి వస్తారో మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు.
పెట్టుబడుల సాధనలో ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుది ప్రత్యేక స్థానం
ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకి ఒక విషయం స్పష్టంగా చెప్పా. వారు కేవలం పెట్టుబడులను తీసుకురావడమే కాదు… భారతదేశ భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఎంఓయూతో ఈడీబీ పని ముగిసిపోదు. అసలు పని అప్పుడే ప్రారంభమవుతుంది. పెట్టుబడిదారులకు భూమి గుర్తించడం, అనుమతుల ప్రక్రియలో మార్గనిర్దేశం చేయడం, ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయడం, సరఫరాదారుల వ్యవస్థను అభివృద్ధి చేయడం, సమస్యలను పరిష్కరించడం, విస్తరణలో సహకరించడం వంటి ప్రతి దశలో ఈడీబీ తోడ్పడుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే… మీ మొత్తం పెట్టుబడి ప్రయాణంలో ఈడీబీ మీ భాగస్వామి.
ఏపీ అభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వామ్యం కావాలి
కియా ఏం సాధ్యమో చూపించింది. ఎల్జీ తదుపరి అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఇప్పుడు మరెన్నో కొరియా కంపెనీలు కూడా ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, షిప్ బిల్డింగ్, ఆటోమోటివ్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, మెరైన్ ఎక్విప్ మెంట్, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్, అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఏపీ స్వాగతం పలుకుతోంది. మా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించండి. మా పరిశ్రమలను చూడండి. మా వేగాన్ని పరిశీలించండి. అదేవిధంగా నవంబర్ లో ఏపీలో నిర్వహించే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌కు మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా.
ఏపీ-కొరియా భాగస్వామ్యంలో మూడో అధ్యాయాన్ని లిఖించబోతున్నాం
ఆంధ్రప్రదేశ్-కొరియా భాగస్వామ్యంలోని మొదటి అధ్యాయం ఆటోమొబైల్ రంగం ద్వారా లిఖించడం జరిగింది. రెండో అధ్యాయం ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇప్పటికే కొనసాగుతోంది. మూడో అధ్యాయాన్ని మనమందరం కలిసి సెమీకండక్టర్లు, షిప్ బిల్డింగ్, ఏఐ, క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధనం, అధునాతన తయారీ రంగాల్లో లిఖించబోతున్నాం. 2030 నాటికి భారత్- కొరియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని రెండు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఆ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రధాన శక్తిగా నిలుపుదాం. కొరియాలో వేగంగా ముందుకు సాగాలనేందుకు ఒక అందమైన ఫిలాసఫీ ఉంది. ‘పల్లి పల్లి’. ఆంధ్రప్రదేశ్ కూడా అదే స్ఫూర్తిని స్వీకరించింది. మేం లక్ష్యంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. ఈ ప్రయాణంలో మీరందరూ మాతో కలిసి నడవాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్, కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ (MOFA) ఆసియా, పసిఫిక్ వ్యవహారాల బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీమతి లీ మిన్-క్యోంగ్ (Ms. Lee Min-kyong), ఇన్వెస్ట్ కొరియా కమిషనర్ డా.కిమ్ టే హ్యుంగ్ (హ్యుంగ్ కిమ్) (Dr. Kim, Tae Hyung (Hyung Kim)), సీఐఐ ఆంధ్రప్రదేశ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఛైర్మన్ ఎస్.నరేంద్ర కుమార్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ లీడర్ సంగ్ హియో, సోలమ్ సీవోవో జే గ్యాబ్ హా, కోట్రా(KOTRA) అవుట్‌బౌండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎం&ఏ టీమ్ డిప్యూటీ డైరెక్టర్ డే క్యున్ కిమ్, ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఏపీ ఇండస్ట్రీస్ కమిషనర్ శుభమ్ భన్సల్ తదితరులు పాల్గొన్నారు.








