కాళేశ్వరంపై కన్ఫ్యూజన్లో బీజేపీ..!?
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి రాజకీయ వర్గాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. ఒకవైపు కేంద్రంలోని తమ ప్రభుత్వ పరిధిలోని సంస్థ ఇచ్చిన నివేదికకు భిన్నంగా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతుండడం, మరోవైపు దీనిని అధికార కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుని విమర్శలు గుప్పించడంతో కాళేశ్వరం చుట్టూ రాజకీయం వేడెక్కింది.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రంగంలోకి దిగి పరిశీలనలు జరిపింది. ప్రస్తుతానికి మేడిగడ్డ వద్ద నీటిని నిలపవద్దని, అలా చేస్తే బ్యారేజీ నిర్మాణానికి మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ స్పష్టమైన సిఫారసు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ మార్గదర్శకత్వంలోనే ఈ సంస్థ పనిచేస్తోంది.
అయితే, విచిత్రంగా రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇందుకు భిన్నమైన డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగంగానే స్పందిస్తూ.. కాళేశ్వరంలో నీటిని నింపి, ఎత్తిపోయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు సైతం కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. కేంద్ర సంస్థ చెప్పినదానికి భిన్నంగా, రాష్ట్ర బీజేపీ నేతలు నీటిని నింపాలని కోరడం వెనుక ఉన్న వ్యూహం ఏంటో అర్థం కాక ఆ పార్టీ శ్రేణులే గందరగోళానికి గురవుతున్నారు.

రాష్ట్ర బీజేపీ నేతల విమర్శలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతే దీటుగా స్పందిస్తోంది. తాము సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్డీఎస్ఏ సిఫారసులనే తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. ఒకవేళ ఎన్డీఎస్ఏ నివేదికను కాదని నీటిని నిలిపితే, భవిష్యత్తులో బ్యారేజీకి ఏమైనా నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కేంద్ర సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లేనిపోని సాంకేతిక, చట్టపరమైన సమస్యలు వస్తాయని ప్రభుత్వం వివరిస్తోంది. బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ఈ గందరగోళాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పూర్తిగా వాడుకుంటోంది. బీఆర్ఎస్ చెప్పినట్లే బీజేపీ నేతలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ కొత్త పల్లవి అందుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, వైఫల్యాలపై బీఆర్ఎస్ తీరును గతంలో తప్పుబట్టిన బీజేపీ, ఇప్పుడు అదే బీఆర్ఎస్ లైన్ను ఎందుకు అందుకుందని ప్రశ్నిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే రంగంలోకి దిగి.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే ఈటల రాజేందర్ నడుచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గత అవగాహన కుదిరిందనే అనుమానాలకు ఈ వైఖరే నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
వాస్తవానికి కాళేశ్వరం అవినీతిపై బీఆర్ఎస్ను గద్దె దించుతామని గతంలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను టార్గెట్ చేసే క్రమంలో, బీఆర్ఎస్ వాదనకు బలం చేకూర్చేలా మాట్లాడడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు కేంద్ర సంస్థ నీళ్లు నిలపొద్దంటుంటే, మరోవైపు రాష్ట్ర నేతలు నీళ్లు నింపాలనడం ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై పార్టీలో సరైన సమన్వయం, స్పష్టత కొరవడిందని స్వయంగా బీజేపీలోని కొందరు ముఖ్య నేతలే అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ ఎంత ఆలస్యమైతే అంత రాజకీయ ప్రయోజనం పొందాలని ఒకరు, కేంద్ర నివేదికలను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను కట్టడి చేయాలని మరొకరు చూస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో బీజేపీ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఆ పార్టీకే తిప్పలు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి.








