నేపాల్ గోల్డ్ .. యార్స గూంబా..!
హిమాలయ పర్వత శ్రేణుల్లో ‘బంగారు వేట‘ తిరిగి ప్రారంభమైంది. బంగారు వేట అంటే నిజమైన బంగారం గురించి అన్వేషణ కాదు. బంగారం లాంటి యార్స గూంబా కోసం .. నేపాల్ ప్రజలు గూడు, కుటుంబంలో ముసలి , పిల్లల్ని వదిలి మరీ ప్రాణాలకు తెగించి అన్వేషణ సాగిస్తున్నారు.వేలాది మంది గ్రామస్థులు ప్రాణాలకు సైతం తెగించి ఎత్తైన పర్వత ప్రాంతాలకు పయనమవుతున్నారు.
‘హిమాలయన్ గోల్డ్’గా ప్రాచుర్యం పొందిన ఈ ఫంగస్, అంతర్జాతీయ మార్కెట్లో కిలో సుమారు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ధర పలుకుతోంది. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబాలను పోషించలేని స్థితిలో ఇక్కడి ప్రజలకు… ఇదే ప్రధాన వార్షిక ఆదాయ వనరుగా మారింది.
చైనా, టిబెట్ సంప్రదాయ వైద్యంలో యార్సగూంబాకు విశేష ప్రాధాన్యత ఉంది. శరీర దృఢత్వాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఔషధంగా దీనిని పరిగణిస్తారు. ముఖ్యంగా, దీనికున్న ప్రత్యేక లక్షణాల వల్ల దీనిని ‘హిమాలయన్ వయాగ్రా’ అనే కూడా పిలుస్తారు. ఈ ఫంగస్ సేకరణపై స్థానిక ప్రభుత్వాలు ప్రస్తుతం పలు నిబంధనలు విధిస్తూ, ప్రజల ఆదాయ మార్గాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నాయి.
శాస్త్రీయంగా ‘ఓఫియోకార్డిసెప్స్ సినెన్సిస్’ అని పిలిచే ఈ యార్సగూంబా, ఒక రకమైన గొంగళిపురుగుపై పెరిగే పరాన్నజీవి ఫంగస్. ప్రతి ఏటా మంచు కరిగిన తర్వాత మే నుంచి జూలై మాసాల మధ్య, సముద్ర మట్టానికి 3,500 నుండి 5,000 మీటర్ల ఎత్తులో మాత్రమే ఇది లభిస్తుంది. ఈ సీజన్లో డోల్పా, జుమ్లా, ముగు వంటి జిల్లాల్లోని గ్రామాలు దాదాపు ఖాళీ అవుతాయి. మహిళలు, చిన్నారులతో సహా కుటుంబ సభ్యులంతా ప్రతికూల వాతావరణంలోనూ తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని దీని కోసం అన్వేషిస్తుంటారు.








