మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ లాగా… ‘AI మెమరీ పోర్టబిలిటీ’ కూడా రాబోతోందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక మనిషిని…
అతను లేదా ఆమె జ్ఞాపకాల నుంచి వేరు చేస్తే…
అతను బతికే ఉంటాడు.
కానీ…
అతను ఎవరో మాత్రం మిగలడు.
ఎందుకంటే… మనిషిని నిర్వచించేది అతని పేరు కాదు.
అతని జ్ఞాపకాలే.
వింతగా అనిపించొచ్చు. కానీ…AI ప్రపంచం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది.
జ్ఞాపకాలే జీవితం… AIకి అదే సమస్య!
ఇవి కూడా చదవండి
మీతో వందల గంటలు మాట్లాడిన ChatGPTకి మీ రాత తెలుసు. మీ ఆలోచనా విధానం తెలుసు. మీరు చేస్తున్న ప్రాజెక్టులు కూడా గుర్తుంటాయి. కానీ అదే పని కోసం Geminiని ఓపెన్ చేస్తే… అక్కడ మీరు పూర్తిగా కొత్త వ్యక్తి. Claudeకి మీ కథ మొదటి పేజీ కూడా తెలియదు.
ఇది ఏ ఒక్క AI లోపం కాదు. ప్రస్తుతం ఉన్న చాలా AI అసిస్టెంట్లు తమ తమ మెమరీని విడివిడిగా నిర్వహిస్తున్నాయి. ఫలితంగా మీ పరిశోధన ఒక AIలో, మీ రైటింగ్ స్టైల్ మరో AIలో, మీ పని విధానం ఇంకో AIలో మిగిలిపోతోంది. అంటే… మీ డిజిటల్ జీవితమే చిన్న చిన్న అధ్యాయాలుగా విడిపోయి, వేర్వేరు AIలలో నిల్వ అవుతోంది.
ప్రతి AI కొత్త పరిచయం… యూజర్‌కు అదే విసుగు!
ప్రతి కొత్త AI ముందు మనం మళ్లీ మళ్ళీ ఒకే వాక్యంతో ప్రారంభించాల్సి వస్తోంది.
“Hi… Let me tell you about myself.”
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ప్రతి సారి మనల్ని కొత్త వ్యక్తిలా చూసే AI… నిజంగా Personal Assistant ఎలా అవుతుంది?
ఈ సమస్య మీ ఒక్కరిది కాదు. ప్రపంచవ్యాప్తంగా రచయితలు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కంటెంట్ క్రియేటర్లు రోజూ ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
ఒక తెలుగు స్క్రిప్ట్ రైటర్ నెలల తరబడి ChatGPTతో సినిమా కథ రాశాడనుకుందాం. క్లైమాక్స్ విశ్లేషణ కోసం Claudeకి మారగానే… “కథ ఏంటి?” అనే ప్రశ్నతో మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి వస్తుంది.
ఒక UPSC విద్యార్థి నెలరోజులుగా ఒక AIతో చదువుతున్నా, మరో AIకి మారిన క్షణం తన లక్ష్యం, చదువు విధానం, సిలబస్ అన్నీ మళ్లీ వివరించాల్సిందే.
అప్పుడు అర్థమవుతుంది…సమస్య AI తెలివి కాదు. AI జ్ఞాపకాలు ఒకదానికొకటి చేరకపోవడమే.
మొబైల్ నెంబర్ మారలేదు… మరి AI జ్ఞాపకాలు?
కొన్ని సంవత్సరాల క్రితం…
ఒక మొబైల్ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారాలంటే… మీ ఫోన్ నెంబర్ కూడా మారిపోయేది. తర్వాత వచ్చింది… Mobile Number Portability. కంపెనీ మారింది. కానీ…మీ నెంబర్ మాత్రం మారలేదు. ఇప్పుడు…
టెక్నాలజీ ప్రపంచం ఇదే ప్రశ్నను AI విషయంలో అడుగుతోంది.
ChatGPT నుంచి Geminiకి మారితే…
Gemini నుంచి Claudeకి మారితే…
మీ డిజిటల్ జ్ఞాపకాలు కూడా మీ వెంట వస్తే?
ఇదే ఆలోచన ఇప్పుడు AI Memory Portabilityగా రూపుదిద్దుకుంటోంది.
తెలివి ఉంది… కానీ తలపులు లేవు!
సమస్య AI తెలివి కాదు. AI జ్ఞాపకాలు ఒకదానితో ఒకటి కలవకపోవడమే. ఈ సమస్యను గుర్తించిన టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు మరో దిశగా ఆలోచిస్తున్నాయి. అందుకే Centralized AI Memory అనే కాన్సెప్ట్ వేగంగా చర్చలోకి వస్తోంది. దీని ఆలోచన చాలా సులభం. మీరు ఏ AIని ఉపయోగించినా, మీ డిజిటల్ కాంటెక్స్ట్ మాత్రం మీతోనే ఉండాలి.
ఒకే జ్ఞాపకం… ఎన్నో AIలకు?
ఇది కేవలం ఊహ కాదు.
ప్రస్తుతం OpenAI, Google, Anthropic, Microsoft వంటి కంపెనీలు తమ AIలకు మెమరీ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఎందుకంటే ఒక విషయం స్పష్టమైంది. AI ప్రపంచంలో ఇప్పుడు అత్యంత విలువైన ఆస్తి… యూజర్ కాంటెక్స్ట్. కానీ ఒక్కో కంపెనీ ఒక్కో మెమరీ నిర్మిస్తే… యూజర్ సమస్య మాత్రం అలాగే ఉంటుంది.
అందుకే…
Centralized AI Memory అనే ఆలోచనపై ఆసక్తి పెరుగుతోంది.
దీని ఉద్దేశం చాలా సింపుల్. మీ జ్ఞాపకాలు… ఒక AIలో బందీ కావడం కాదు. మీరు ఏ AIని ఉపయోగించినా… మీ డిజిటల్ కాంటెక్స్ట్ మీ వెంట రావడం.
మీ ఇంట్లో నలుగురు అసిస్టెంట్లు ఉన్నారని ఊహించండి. ఇప్పటివరకు… వాళ్లందరికీ విడివిడిగా మీ గురించి చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు… వాళ్లందరూ ఒకే డైరీ చదివితే? మీరు ఒక్కసారి రాసిన విషయం… అందరికీ తెలుస్తుంది. Centralized AI Memory కూడా దాదాపు ఇదే.
AIలకు ఒకే భాష వస్తుందా?
ఈ ఆలోచనను నిజం చేయడానికి మరో కీలక ప్రయత్నం కూడా జరుగుతోంది. Anthropic రూపొందించిన Model Context Protocol (MCP) అనే ఓపెన్ స్టాండర్డ్‌కు AI పరిశ్రమలో మద్దతు పెరుగుతోంది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సాధ్యమవ్వడానికి టెలికాం కంపెనీలు కొన్ని ఉమ్మడి నియమాలను పాటించినట్టే…AI ప్రపంచంలో కూడా అలాంటి ఉమ్మడి ప్రమాణాలు అవసరం. MCP ప్రయత్నం అదే. ఒక AIకి తెలిసిన కాంటెక్స్ట్…మరో AI కూడా అర్థం చేసుకునేలా ఒక ఉమ్మడి భాషను రూపొందించడం.
ఇదే సమయంలో Supermemory వంటి ప్లాట్‌ఫారమ్‌లు AIకి బయట ఒక స్వతంత్ర మెమరీ లేయర్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ ఈ దిశ విజయవంతమైతే… ఇప్పటివరకు…AIకి మెమరీ ఉండేది. ఇకపై…మెమరీకి AIలు ఉండబోతున్నాయి.
కానీ… ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది
AI మెమరీ పోర్టబిలిటీ వినడానికి అద్భుతంగా ఉంటుంది. కానీ… ఒక పెద్ద ప్రశ్న కూడా వెంటనే వస్తుంది.మీ జీవితమంతా… ఒకే డిజిటల్ మెమరీలో ఉంటే… దానికి యజమాని ఎవరు? మీరా? ఆ మెమరీని నిర్వహించే కంపెనీయా?
ఒకవేళ…
ఆ మెమరీ హ్యాక్‌కు గురైతే?
ప్రమాదంలో పడేది… ఒక అకౌంట్ కాదు. మీ డిజిటల్ వ్యక్తిత్వం మొత్తం. అందుకే రేపటి AI పోటీ… కేవలం అత్యంత తెలివైన మోడల్ కోసం మాత్రమే కాదు.యూజర్ నమ్మకాన్ని ఎవరు గెలుస్తారు? అనే దానిపైనా ఉండబోతోంది.
చివరికి…
పోర్ట్ అయ్యేది AI కాదు, మీ జ్ఞాపకాలు
రేపు…AI Memory Portability ఒకవేళ వస్తే… AI ప్రపంచంలో అతిపెద్ద విప్లవం… కొత్త మోడల్ రావడం కాదు. మన డిజిటల్ జ్ఞాపకాలు… ఏ ఒక్క కంపెనీకీ శాశ్వతంగా బందీగా ఉండాల్సిన అవసరం లేకపోవటమే.
ఇవి కూడా చదవండి








