వరల్డ్ టాప్ -3లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్…! చైనా, పాక్ కు బెదురే..!
ప్రపంచంలో చాలా శక్తిమంతమైన దేశాలున్నాయి. రక్షణ పరంగా ఎప్పటికప్పుడు అవి మరింత ఉన్నతస్థాయి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యుద్ధరంగంలో కీలకమైన వాయుసేన విషయానికొస్తే సాదారణంగా అందరూ భావించినట్లే అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.అయితే ఎవరూ ఊహించని విధంగా రష్యా రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మరి మూడోస్థానంలో ఏ ఐరోపా దేశమో ఉంటుందనుకోవచ్చు. కానీ.. అది నిజం కాదు.. ఎందుకంటే మూడోస్థానంలో మన భారతీయ వాయుసేన నిలిచింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వాయుసేనల జాబితాలో భారత వాయుసేన (IAF) మరోసారి తన సత్తా చాటింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ (డబ్ల్యుడీఎంఎంఏ) విడుదల చేసిన 2026 గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో వరుసగా ఐదో ఏడాది కూడా చైనాను వెనక్కి నెట్టి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
స్వతంత్ర జాతీయ వాయుసేనల పరంగా విశ్లేషిస్తే అమెరికా, రష్యాల తర్వాత ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతమైన వాయుసేనగా భారత్ నిలిచినట్లవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డబ్ల్యుడీఎంఎంఏ ‘ట్రూ వాల్యూ రేటింగ్’ (TVR) ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించింది. ఇందులో భారత వాయుసేన 69.4 పాయింట్ల స్కోరు సాధించగా, చైనా వాయుసేన 63.8 స్కోరుతో వెనుకంజలో ఉంది.
కేవలం విమానాల సంఖ్యనే కాకుండా వాటి సాంకేతిక సామర్థ్యం, పైలట్ల శిక్షణ, లాజిస్టిక్స్, భవిష్యత్ ప్రణాళికలు, ఆధునికీకరణ వంటి కీలక అంశాలను WDMMA పరిగణనలోకి తీసుకుంది. భారత వాయుసేన వద్ద సుమారు 1,716 విమానాలు ఉన్నాయి. ఇందులో ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, రవాణా విమానాలు సమతూకంలో ఉండటం వల్లే చైనా కంటే మెరుగైన ర్యాంకు లభించింది.
అయితే, భారత వాయుసేన ముందు ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఉన్నాయి. దేశ రక్షణకు అవసరమైన 42 ఫైటర్ స్క్వాడ్రన్లకు బదులుగా ప్రస్తుతం 29 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు 180 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు, స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాల తయారీని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.








