త్వరలో ప్రజాజీవితంలోకి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..!
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగాగాయపడి చికిత్స పొందిన సుప్రీంలీడర్..తిరిగి ప్రజల మధ్యకు రానున్నారు.తన తండ్రి, దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్మారకార్థం జులై 23న టెహ్రాన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొజ్తబా బహిరంగంగా కనిపించనుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పరిణామంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. టెహ్రాన్‌లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని కీలక నేతలు హాజరుకానున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. తండ్రి మరణానంతరం మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించారు. అయితే, అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. భద్రతా కారణాల రీత్యా ఆయన బయటకు రావడం లేదని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ మొస్సాద్ మొజ్తబాను హత్య చేసే ప్రమాదం ఉండడంతో.. ఆయన తన తండ్రి, భార్య అంత్యక్రియలకు సైతం హాజరుకాలేదు.
ఇదే సమయంలో మొజ్తబా ఆరోగ్యంపై కూడా తీవ్రస్థాయిలో ఊహాగానాలు వ్యాపించాయి. ఫిబ్రవరి 28 దాడిలో ఆయన గాయపడ్డారని, చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆయన ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. దాడుల్లో ఆయన ముఖం రూపురేఖలు మారిపోయి ఉండొచ్చని అన్నారు. అయితే, ఈ వాదనలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మొజ్తబా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేస్తూ, ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇటీవల ఆయన కొత్త ఫోటోను కూడా విడుదల చేసింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ, మొజ్తబా ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. తన తండ్రి మరణానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన శపథం చేశారు. ఈ ప్రకటన తర్వాత గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, మొజ్తబా తొలిసారి బహిరంగంగా కనిపించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నిజంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారా? వస్తే తన ప్రసంగంలో ప్రతీకారంపై ఎలాంటి సందేశం ఇస్తారు? అనే అంశాలపై అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.








