బర్త్ టూరిజాన్ని టార్గెట్ చేసిన ట్రంప్..!
బర్త్ టూరిజంపై ట్రంప్ సర్కార్ మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. జన్మతః లభించే పౌరసత్వాన్ని (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) నిరుత్సాహపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తమ పిల్లలకు పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవాలంటే.. అమెరికా (USA)లోని తల్లిదండ్రులు మున్ముందు తమ పౌరసత్వం, ఇమిగ్రేషన్ స్టేటస్‌కు సంబంధించిన రుజువులు సమర్పించాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇకనుంచి యూఎస్ ప్రభుత్వం దరఖాస్తుదారులను సంబంధింత పత్రాలు అడిగే యోచనలో ఉన్నట్లు సమాచారం.
విదేశీ వలసదారుల పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని పరిమితం చేసేలా (Birthright citizenship), బర్త్ టూరిజాన్ని నిషేధించేలా గతనెల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే అమెరికా విదేశాంగశాఖ తాజా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఈ ప్రభుత్వం అమెరికన్ పౌరసత్వం అర్థాన్ని, విలువను కాపాడుతుందని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. దానికి అనుగుణంగా పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఉంటుంది’’ అని అగ్రరాజ్య విదేశాంగశాఖ పేర్కొంది.
ప్రస్తుతం పాస్‌పోర్ట్ నిబంధనల ప్రకారం.. యూఎస్‌లో జన్మించిన పిల్లల పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకునే తల్లిదండ్రులు వారి బంధాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాలి. దాంతోపాటుగా ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి. అలాగే సిటిజన్‌షిప్ స్టేటస్ వివరాలను దరఖాస్తు పత్రంలో పేర్కొంటే సరిపోతుంది. ఇక, ఇమిగ్రేషన్ స్టేటస్‌ను సమర్పించడం తప్పనిసరేం కాదు. కానీ, ఇక మీదట ఈ పౌరసత్వ, ఇమిగ్రేషన్ వివరాలను రుజువులతో సహా సమర్పించేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.








