మీ తాతలు 100 ఏళ్లు జీవిస్తే… మీరు కూడా ఎక్కువ కాలం జీవిస్తారా? సైన్స్ ఏమంటోంది
కేక్ మీద 100 అనే అంకె ఉంది.
చుట్టూ ఒక పెద్ద కుటుంబం నిలబడి ఉంది. మనవళ్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు. మునిమనవళ్లు కేక్ కోసం అల్లరి చేస్తున్నారు. మధ్యలో మాత్రం ఒక శతాబ్దం చూసిన మనిషి నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
ఓ మనవడు అడుగున్నాడు
“తాతయ్యా… మీ సీక్రెట్ ఏంటి? ఇంతకాలం ఎలా బతికారు?”
పసుపు, పెరుగు, నడక, క్రమశిక్షణ… మనకు తెలిసిన ఏదో ఒక సమాధానం చెప్పారు.అయితే వింటున్న వాళ్లలో చాలా మంది మనసులో మాత్రం మరో ప్రశ్న మొదలైపోయింది.
“ఆయన 100 ఏళ్లు బతికారు సరే… నేను కూడా బ్రతుకుతానా, నాకూ ఆ జీన్స్ వస్తాయా?”
ఎందుకంటే మనం తాతలు, అమ్మమ్మల వయసును కేవలం ఒక అంకెగా చూడం. తెలియకుండానే దాన్ని మన భవిష్యత్తుకు సంబంధించిన సంకేతంగా చదవటానికి అలవాటుపడినవాళ్లం మనం.
“మా తాత 95 వరకు బతికాడు.”
“మా అమ్మమ్మకు 90 దాటినా పెద్ద జబ్బులేమీ లేవు.”
ఈ మాటలు వింటూంటే మన మనసులో ఒక చిన్న భరోసా మొదలవుతుంది. అయితే ఆ భరోసా నిజంగా జరుగుతుందా? లేక మనం కుటుంబ కథల నుంచి మనకు నచ్చిన ఆశను వెతుక్కుంటున్నామా? సైన్స్ ఏమంటోంది ? 100 ఏళ్లు జీవించిన వారి పిల్లలు నిజంగానే ఇతరుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారని చెప్తోందా? వారికి వృద్ధాప్య వ్యాధులు ఆలస్యంగా వస్తాయా?
సైన్స్ సమాధానం ఇదే
ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధకులు ఒకే కుటుంబాన్ని లేదా ఒకే ప్రాంతాన్ని పరిశీలించలేదు. మూడు వేర్వేరు దీర్ఘకాలిక అధ్యయనాల నుంచి వేలాది మంది వివరాలను తీసుకుని పరిశీలించారు. వారిలో 2,300 మందికిపైగా 100 ఏళ్లు జీవించిన వ్యక్తుల పిల్లలు ఉన్నారు. వీరితో పోల్చడానికి, తల్లిదండ్రులు అంత పెద్ద వయస్సు వరకు జీవించని 1,700 మందికిపైగా వ్యక్తులను కూడా పరిశీలించారు.
ఏం తేలింది
ఒకే వయస్సు దశలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అనుకుందాం. వారిలో ఒకరి తల్లిదండ్రులు 100 ఏళ్ల వరకు జీవించారు. మరొకరి తల్లిదండ్రులు అలా జీవించలేదు. ఈ ఇద్దరి ఆరోగ్య ప్రయాణంలో నిజంగా తేడా కనిపించిందా? అవును. కనిపించింది. అదీ ఒక చిన్న తేడా కాదు.
వృద్ధాప్యం వీరి దగ్గరకు కొంచెం ఆలస్యంగా వస్తోంది 100 ఏళ్లు జీవించిన వ్యక్తుల పిల్లల్లో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తక్కువగా కనిపించింది. గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంది. మరణ ప్రమాదం విషయంలో అయితే తేడా మరింత స్పష్టంగా కనిపించింది.
అధ్యయనం ప్రకారం, సెంటెనేరియన్ల పిల్లల్లో అధిక రక్తపోటు ప్రమాదం 32 శాతం తక్కువగా. హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం 33 శాతం తక్కువగా, మరణ ప్రమాదం 42 శాతం తక్కువగా కనిపించింది. కొన్ని అధ్యయనాల్లో స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గినట్లు గుర్తించారు.
అయితే ఇక్కడ అసలు ఇంట్రస్టింగ్ విషయం వేరేది ఉంది. వృద్ధాప్యం వీరిని కొంచెం ఆలస్యంగా చేరుకుంటున్నట్లు కనిపించడం. సెంటెనేరియన్ల పిల్లలకు అధిక రక్తపోటు వచ్చినా, అది ఇతరులతో పోలిస్తే సగటున సుమారు ఐదేళ్లు ఆలస్యంగా కనిపించింది.
అలాగే మరణం కూడా సగటున దాదాపు మూడేళ్లు ఆలస్యంగా నమోదైంది.
దీన్ని బట్టి తేలిందేమిటంటే..వందేళ్ల బ్రతికిన వారి కుటుంబంలోని వ్యక్తులకు లైఫ్ స్పాన్ పెరగటమే కాదు. అనారోగ్యంతో రాకుండా, ఆరోగ్యంగా గడిచే అవకాశం కూడా పెరగడం. వారసత్వంగా వస్తున్నది ‘ఎక్కువ సంవత్సరాలా’… లేక ‘ఎక్కువ ఆరోగ్యమా’? అంటే రెండూను అని చెప్పాలి.
దీర్ఘాయుష్షు గురించి మాట్లాడితే మనం సాధారణంగా ఒకే ప్రశ్న అడుగుతాం. “ఎన్ని ఏళ్లు బతికారు?”. కానీ శాస్త్రవేత్తలకు మరో ప్రశ్న వేస్తారు. “ఆ సంవత్సరాలు ఎంత ఆరోగ్యంగా బతికారు?” అని. ఎందుకంటే 90 ఏళ్లు జీవించడం ఒక విషయం. 90 ఏళ్ల వయస్సులో కూడా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండటం మరో విషయం.
ఇవి కూడా చదవండి
ఈ అధ్యయనంలో …సెంటెనేరియన్ల పిల్లలు కేవలం ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నవారిగా మాత్రమే కనిపించలేదు. వయస్సుతో వచ్చే కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలను ఆలస్యంగా ఎదుర్కొనే వ్యక్తులుగా కూడా కనిపించటం జరిగింది.
అయితే ఇక్కడో మెలిక
క్యాన్సర్ విషయంలో అదే కథ కనిపించలేదు. ఇక్కడ అధ్యయనం ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మరణ ప్రమాదం విషయంలో స్పష్టమైన ప్రయోజనం కనిపించినప్పటికీ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం మాత్రం గణనీయంగా తగ్గినట్లు కనిపించలేదు. అంటే సెంటెనేరియన్ల పిల్లలకు క్యాన్సర్ అసలు రాదని ఈ అధ్యయనం చెప్పడం లేదు.
ఇది మొత్తం జన్యువుల మేటరేనా?
ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఎక్కువ కాలం జీవించడానికి జన్యువులు మాత్రమే కారణం కావాల్సిన అవసరం లేదు. ఒకే ఇంట్లో పెరిగినవారు తరచూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటారు. ఒకే ప్రాంతంలో జీవిస్తారు. కుటుంబ అలవాట్లు కూడా దగ్గరగా ఉంటాయి. ధూమపానం చేయకపోవడం, ఎక్కువగా నడవడం, ఆహార నియమాలు పాటించడం వంటి అలవాట్లు కూడా తరతరాలుగా కొనసాగవచ్చు.
ఫైనల్ గా
ఇన్నాళ్లూ మన డాక్టర్ అడిగే కుటుంబ చరిత్ర ప్రశ్నల్లో మనం ప్రధానంగా వ్యాధుల గురించే ఆలోచించేవాళ్లం.
“మీ కుటుంబంలో మధుమేహం ఉందా?”
“గుండె జబ్బులు ఉన్నాయా?”
“క్యాన్సర్ చరిత్ర ఉందా?”
కానీ ఇప్పుడు మరో ప్రశ్న కూడా అడగాలి.
“మీ కుటుంబంలో ఎవరు ఎంతకాలం, ఎంత ఆరోగ్యంగా జీవించారు?”
—సూర్య ప్రకాష్ జోశ్యుల








