చౌకగా ప్రాపర్టీ దొరికిందని కొనేయద్దు.. ముందుగా ఇవి చెక్ చేశాక నిర్ణయం తీసుకోండి!
ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీని కొనాలంటే నానా కష్టాలు పడాలి. పైసా పైసా కూడబెట్టి, కొనాల్సి వుంటుంది. దీని కోసం రాత్రిబవంళ్లు కష్టపడతాం. అయితే.. తక్కువ ధరకు, మార్కెట్ విలువ కంటే తక్కువకే ప్రాపర్టీ ఏదైనా లభిస్తుందంటే.. ఆతురత పెరిగి, కొనేడయం అత్యంత సహజం. ఆసక్తి కూడా పెరిగిపోతుంది. కొనేంత వరకూ దాని మీదే ధ్యాస. అయితే.. తొందరపడి నిర్ణయం తీసుకుంటే రాబోయే కాలంలో కొన్ని కష్టాలు కూడా వస్తాయి. ఐటీ నోటీసులు, చట్టపరమైన సమస్యలు, లేదా ఆర్థిక నష్టాలు కూడా వస్తాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే వచ్చే ప్రాపర్టీని తీసుకునే సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి.
డాక్యుమెంట్లు, టైటిల్, రుణాల వివరాలు చెక్ చేయండి

మొట్ట మొదట డాక్యుమెంట్లు, టైటిల్ క్లియరెన్స్ చూసుకోవాలి. ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ స్పష్టంగా వుందో లేదో చూసుకోవాలి. ఇందుకు సీనియర్ లాయర్ ను సంప్రదిస్తే కూడా బాగుంటుంది. వాటన్నింటినీ ఆయన పరిశీలించేట్లు చూసుకోవాలి.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC): ఆ ప్రాపర్టీపై ఎలాంటి బ్యాంక్ లోన్లు, కోర్టు కేసులు లేదా కుదువలు (Mortgages) లేవని నిర్ధారించుకోవడానికి ఫారమ్-15/EC తనిఖీ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైంది. ఆ ప్రాపర్టీపై కోర్టు కేసులు, బ్యాంకు లోన్లు వున్నాయా? లేవా చూసుకోవడానికి ఉపకరిస్తుంది. దీని ద్వారా మనపై ఆ భారం పడకుండా వుంటుంది.
ప్రభుత్వ అనుమతులు, ధరల విషయంలో జాగ్రత్త

ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ (Circle Rate/Guidance Value) కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటే ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act – Section 56(2)(x)) ప్రకారం సమస్యలు రావచ్చు. దీని విషయంలో చాలా జాగ్రత్తగా మనం మెసులుకోవాలి. ప్రభుత్వ ధర కంటే తక్కువకు కొంటే, వ్యత్యాస మొత్తాన్ని (Difference Amount) కొనుగోలుదారు ఆదాయంగా పరిగణించి పన్ను విధించే అవకాశం ఉంది. ఇలా విధించమని ప్రభుత్వ నిబంధనలు కూడా వున్నాయి. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్కెట్/స్టాంప్ డ్యూటీ విలువలను ముందే సరిచూసుకోండి.
ఇవి కూడా చదవండి
ప్లాట్ లేదా ఫ్లాట్ అయితే అది HMDA, GHMC, DTCP, లేదా RERA లచే గుర్తింపు పొందిందో లేదో చూడండి.ప్రభుత్వ అనుమతులు లేని లేఅవుట్లు లేదా చెరువు శిఖం (FTL), బఫర్ జోన్లలో ఉన్న ప్రాపర్టీలను తక్కువ ధరకే అమ్ముతుంటారు. వీటి జోలికి వెళ్లొద్దు.
ప్రాంత భవిష్యత్తు, తక్కువ ధరకు కారణం తెలుసుకోండి

అలాగే అది అభివృద్ధి చెందే ప్రాంతమా? కాదా? అన్నది కూడా చూసుకోవాలి. ప్రస్తుతం ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉన్నా, రాబోయే రోజుల్లో అక్కడ రోడ్లు, ఐటీ పార్కులు లేదా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందో లేదో రీసెర్చ్ చేయండి.రవాణా సదుపాయాలు, హాస్పిటల్స్, స్కూళ్లు ఎంత దూరంలో ఉన్నాయో గమనించండి.
అలాగే ఆ ప్రాపర్టీపై ఎలాంటి పాత బాకీలు లేకుండా చూసుకోవాలి. ఆస్తి పన్ను బిల్లులు అన్నీ చెల్లించబడ్డాయా?పాత యుటిలిటీ బిల్లుల బకాయిలు ఏమైనా ఉన్నాయా?అపార్ట్మెంట్ అయితే సొసైటీ మెయింటెనెన్స్ బకాయిల కోసం నో డ్యూస్ సర్టిఫికేట్ (NOC) తీసుకోండి.
అయితే.. అసలు కారణాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి. అమ్మకందారు మార్కెట్ రేట్ కంటే తక్కువగా ఎందుకిస్తున్నారో తెలుసుకోవాలి. కుటుంబ వివాదాలు, కోర్టు స్టేలు, లేదా పంపకాల గొడవల వల్ల తక్కువకు ఇస్తున్నారా? లేక కేవలం ఆర్థిక అత్యవసరం వల్ల మాత్రమేనా? ఇతర కారణాలున్నాయా? అని సమాచారం సేకరించుకోవాలి. ప్రాపర్టీని స్వయంగా వెళ్లి చూడండి. ల్యాండ్ వివాదాల్లో ఉందా, ఎవరైనా కబ్జా చేశారా అనేది స్థానికులను అడిగి తెలుసుకోండి.







