‘అవసరమైతే నేనే కాక్రోచ్’..జగన్ కొత్త రాజకీయ వ్యూహం ఇదేనా..
వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. ఇంతకాలం జగన్‌ను సింహంతో పోలుస్తూ.. ‘సింహం సింగిల్‌గా వస్తుంది’ అంటూ వైసీపీ (YSRCP) శ్రేణులు చెప్పుకునేవి. అయితే తాజాగా అవసరమైతే తాను కూడా ‘కాక్రోచ్’గా మారతానంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అసలు జగన్ ఈ పదాన్ని ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుక ఉన్న రాజకీయ సందేశం ఏమిటన్న దానిపై చర్చ జరుగుతోంది.
తాజా ప్రెస్మీట్లో జగన్ వ్యవస్థల్లో లోపాలు పెరిగితే వాటిని ప్రశ్నించే శక్తులు సహజంగానే పుట్టుకొస్తాయని వ్యాఖ్యానించారు. పాలన సక్రమంగా సాగకపోతే, ప్రజల్లో అసంతృప్తి పెరిగితే ఒక దశలో అది తిరుగుబాటు రూపం దాల్చుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించే వారిని ‘కాక్రోచ్లు’గా అభివర్ణిస్తూ.. అవసరమైతే తాను కూడా ఆ పాత్రలోకి వస్తానన్న సంకేతాన్ని ఇచ్చారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ప్రయత్నిస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇటీవల కాలంలో జగన్ ప్రసంగాల్లో ‘కాక్రోచ్’ అనే పదం పదేపదే వినిపిస్తుండటం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు నెలల క్రితం ఢిల్లీ (Delhi)లో విద్యార్థి ఉద్యమాల సమయంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో జరిగిన నిరసనలు కూడా ఈ పదానికి ఒక రాజకీయ నేపథ్యాన్ని తీసుకొచ్చాయి. ఆ ఉద్యమం ద్వారా వినిపించిన నిరసన స్వరం ఇప్పుడు జగన్ వ్యాఖ్యల్లో మరో రూపంలో కనిపిస్తోందని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం మెగా డీఎస్సీ (Mega DSC) అంశాన్ని జగన్ ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఎస్సీ విషయంలో వైసీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. కలెక్టరేట్ల వద్ద నిరసనలు, అధికారులకు వినతిపత్రాల సమర్పణ, శాసనమండలిలో చర్చకు డిమాండ్లు చేసింది. ఈ అంశం కొంత సద్దుమణిగిందనుకున్న సమయంలో జగన్ స్వయంగా ప్రెస్మీట్లో దీన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే జగన్ వ్యాఖ్యల్లో మరో రాజకీయ వ్యూహం కూడా కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. గతంలో ఆయన యువ భేరీ (Yuva Bheri) కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువతతో నేరుగా మమేకమయ్యారు. ఇప్పుడు కూడా యువతకు సంబంధించిన బలమైన సమస్యను కేంద్రంగా చేసుకుని మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది పాదయాత్ర చేపడతానని జగన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. దానికి ముందు ప్రజల్లో రాజకీయ వేడి పెంచేందుకు మెగా డీఎస్సీ వంటి అంశాలను ఉపయోగించుకుంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీలో చిన్న వర్గాల నిరసనలు పెద్ద రాజకీయ సందేశంగా మారినట్లే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక బలమైన ప్రజా సమస్య చుట్టూ ఉద్యమాన్ని నిర్మించాలన్న ఆలోచన వైసీపీకి ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ ‘కాక్రోచ్’ వ్యాఖ్యను కేవలం ఒక మాటగా చూడాలా? లేక రాబోయే రాజకీయ పోరాటానికి ముందస్తు సంకేతంగా భావించాలా అన్నది కాలమే తేల్చాలి. అయితే సింహం ఇమేజ్‌తో ఉన్న జగన్ తనను తాను కాక్రోచ్‌గా పోల్చుకోవడం మాత్రం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది.








