కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం అల్టిమేటం!
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడును తిప్పికొట్టడంతో పాటు, రాబోయే కాలంలో పార్టీని, ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2028 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ఆయన నేరుగా ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేయడం, దిశానిర్దేశం చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రతి చర్చలోనూ పాల్గొనాలని స్పష్టం చేశారు. తమ నియోజకవర్గ సమస్యలను గట్టిగా వినిపించాలని ఆదేశించారు. కేవలం ఎన్నికల్లో గెలిచిపోయామనే ధీమాతో ఉంటే సరిపోదని, అసెంబ్లీలో వారి పనితీరు, ప్రజలతో నిరంతర సంబంధాల ఆధారంగానే భవిష్యత్తు రాజకీయ భవితవ్యం ముడిపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో రెండోసారి టికెట్ దక్కాలంటే ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో బలమైన ముద్ర వేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు విజయవంతంగా పూర్తవుతున్న తరుణంలో.. ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎల్పీ సమావేశంలో చర్చించారు. ఇదే సమయంలో, గత బీఆర్ఎస్ పాలనలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, 22ఏ భూముల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున వాస్తవాలను బయటపెట్టే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వేదికగా కుట్రలు పన్ని అసెంబ్లీ సజావుగా సాగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని, ధరణి అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా సభలో రచ్చ చేస్తోందని సీఎం తీవ్రంగా మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, గత మూడు రోజుల అసెంబ్లీ పరిణామాలపై ప్రభుత్వం నిర్వహించిన ఫ్లాష్ సర్వే ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ప్రస్తావించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తప్పుపడుతున్నారని, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం బలంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసిందని ఆయన వెల్లడించారు. ఇదే జోరును కొనసాగిస్తూ.. SIRపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఓటర్ల తొలగింపు వంటి కుట్రలపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, సర్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మొత్తంగా చూస్తే, సీఎల్పీ సమావేశం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కేవలం పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవడమే కాకుండా, రాబోయే రాజకీయ యుద్ధానికి అందరినీ సన్నద్ధం చేశారు. ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొడుతూనే, ప్రభుత్వ పనితీరును క్షేత్రస్థాయిలో నిరూపించుకోవాలనే స్పష్టమైన అజెండాతో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.








