మందార మొక్కకు పట్టిన తెల్ల పిండి పురుగును.. ఇలా ఇంటి చిట్కాలతోనే తొలగించండి!
మందార (Hibiscus) మొక్క ఇంటి తోటకు అందాన్ని తీసుకురావడమే కాకుండా, తరచూ పూలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. అయితే పిండి పురుగు (Mealybug) సోకితే మొక్క ఆరోగ్యం దెబ్బతిని ఆకులు పసుపురంగులోకి మారడం, కొత్త చిగుళ్లు బలహీనపడటం, పూలు తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆకుల కింద, కొత్త కొమ్మలు, కాడల మధ్య తెల్లటి పత్తిలాంటి పదార్థం కనిపిస్తే పిండి పురుగు దాడిగా గుర్తించవచ్చు. ప్రారంభ దశలోనే గుర్తించి సేంద్రియ పద్ధతుల్లో నియంత్రిస్తే మొక్కను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
పురుగులను తొలగించి సహజ స్ప్రేలు ఉపయోగించండి

పురుగులు తక్కువగా ఉన్నప్పుడు ముందుగా వాటిని తొలగించడం సులభమైన మార్గం. అయితే డైరెక్ట్ గా చేతితో తొలగించడం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ ఓకే అవకాశం ఉంటుంది. కాబట్టి కాటన్ బడ్ (Cotton Bud) లేదా మెత్తని బట్టను నీటితో తడిపి ఆకుల కింద, కాడలపై కనిపించే పురుగులను నెమ్మదిగా శుభ్రం చేయాలి. ఈ ప్రక్రియను కొన్ని రోజుల పాటు కొనసాగిస్తే ప్రారంభ దశలో పురుగుల సంఖ్యను తగ్గించవచ్చు.
వేప నూనె (Neem Oil)ను సహజ పురుగుల నియంత్రణలో ఉపయోగించవచ్చు. నీమ్ ఆయిల్‌ను నీటిలో తగిన మోతాదులో కలిపి ఆకుల పైభాగం, కిందిభాగం, కాడలపై స్ప్రే (Spray) చేయాలి. పిండి పురుగులు దాక్కునే ప్రదేశాలకు ద్రావణం చేరేలా చూడటం ముఖ్యం. నూనెను ఎక్కువగా ఉపయోగించకూడదు. ముందుగా ఒకటి రెండు ఆకులపై పరీక్షించి, ఎలాంటి ఇబ్బంది లేకపోతే మొత్తం మొక్కకు ఉపయోగించడం మంచిది.
సబ్బు ద్రావణంతో పాటు మొక్క చుట్టూ పరిశుభ్రత

మైల్డ్ లిక్విడ్ సబ్బు (Mild Liquid Soap)ను నీటిలో చాలా తక్కువ మోతాదులో కలిపి సహజ స్ప్రేగా ఉపయోగించవచ్చు. ఇది పురుగులపై పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే గాఢమైన డిటర్జెంట్లు లేదా బలమైన సబ్బులను ఉపయోగిస్తే ఆకులు కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే తేలికపాటి ద్రావణాన్నే ఎంచుకోవాలి.
ఇవి కూడా చదవండి
మొక్క చుట్టూ పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. ఎండిపోయిన ఆకులు, దెబ్బతిన్న కొమ్మలను తొలగించి కుండి చుట్టూ శుభ్రంగా ఉంచాలి. మొక్క చాలా దట్టంగా పెరిగితే అవసరం లేని కొమ్మలను కత్తిరించడం ద్వారా గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. గాలి సరిగా ప్రసరించని ప్రదేశాల్లో మొక్కలను చాలా దగ్గరగా ఉంచకపోవడం మంచిది.
నీరు, డ్రైనేజ్‌తో పాటు క్రమం తప్పకుండా పరిశీలించండి

మందార మొక్కకు నీరు పోసే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మట్టి పైభాగం కొద్దిగా పొడిగా అనిపించినప్పుడు నీరు ఇవ్వాలి. కుండీలో నీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ (Drainage) సరిగా ఉండేలా చూసుకోవాలి. మొక్క ఆరోగ్యంగా, బలంగా ఉంటే పురుగుల దాడిని తట్టుకునే సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
పిండి పురుగులు తగ్గిన తర్వాత కూడా మొక్కను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా కొత్త ఆకులు, చిగుళ్లు, కొమ్మల కలయిక ప్రాంతాల్లో పురుగులు దాగి ఉన్నాయా చూడాలి. పక్కనే ఉన్న ఇతర మొక్కలకు కూడా పురుగులు వ్యాపించాయా అని పరిశీలించడం అవసరం.
ఇలా ప్రారంభ దశలోనే పురుగులను తొలగించడం, వేప నూనెను సరైన విధంగా ఉపయోగించడం, మొక్క చుట్టూ పరిశుభ్రత పాటించడం, గాలి ప్రసరణ ఉండేలా చూడటం వంటి చర్యలను కలిపి పాటిస్తే మందార మొక్కపై పిండి పురుగు సమస్యను సేంద్రియ పద్ధతుల్లో నియంత్రించవచ్చు. పురుగుల దాడి తీవ్రంగా ఉంటే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.








