ChatGPTకి మీరు అడిగే ఒక్క ప్రశ్న వెనుక.. రూ.10 కోట్ల ఫైన్! అసలు లింక్ ఇదే
మనం రోజూ అవసరం కోసమో లేకసరదాగానో ChatGPTనో, మరొక AIనో ఓ ప్రశ్న అడుగుతాం. చిటికెలో సమాధానం వచ్చేస్తుంది! భలే ఉంది కదా అనుకుంటాం. కానీ ఆ సమాధానం మన ఫోన్లోనో, లాప్టాప్లోనో తయారవ్వదు. ఎక్కడో మైళ్ల దూరంలో ఉన్న ఓ భారీ డేటా సెంటర్లో, వేలాది కంప్యూటర్లు కష్టపడితేగానీ ఆ ఆన్సర్ రాదు. అయితే ఇప్పుడు అసలు సమస్య ఆ AI తెలివి,లేదా కష్టంతో కాదు… అది నడవటానికి అవసరమైన పవర్ తో వచ్చింది! అవును, AIకి నిత్యావసరం, కరెంట్! ఇప్పుడు ఆ విద్యుత్ అవసరమే AI ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
ఇంట్లో కరెంట్ పోతే సరే, డేటా సెంటర్లో పోతే?
మన ఇంట్లో కరెంట్ పోతే కాసేపు ఇన్వర్టర్ వేసుకుంటాం, లేదా విసనకర్ర పట్టుకుంటాం. కానీ ఒక పెద్ద AI డేటా సెంటర్లో కరెంట్ పోతే? కొన్ని లైట్లు ఆగిపోవడం కాదు, అక్కడ ఉండే వేలాది సర్వర్లు, AI చిప్స్, అవన్నీ వేడెక్కిపోకుండా చూసే భారీ కూలింగ్ సిస్టమ్స్ ఒకేసారి తుస్సుమంటాయి. అందుకే కొన్ని కంపెనీలు “కరెంట్ గ్రిడ్ వాళ్ల కోసం వేచి చూస్తే పనులు కావు, మనమే సొంతంగా కరెంట్ తయారు చేసుకుందాం!” అని డిసైడ్ అయ్యాయి. సరిగ్గా ఇక్కడే అసలు డ్రామా మొదలైంది.
పది కోట్ల ఫైన్ వెనుక ఉన్న అసలు కథ!
అమెరికాలోని న్యూజెర్సీలో ‘డేటా వన్’ అనే సంస్థ ఒక పెద్ద డేటా సెంటర్ కడుతోంది. అక్కడ పర్యావరణ శాఖ (DEP) అధికారులు వచ్చి చూసి, ఏకంగా 1.07 మిలియన్ డాలర్లు… అంటే మన ఊరి లెక్కల్లో 10 కోట్లకు పైగా ఫైన్ వేశారు. ఎందుకంటారా? సరైన అనుమతులు తీసుకోకుండా ఏకంగా 62 నేచురల్ గ్యాస్ జనరేటర్లను నడిపేస్తున్నారని! ఇది ఏదో చిన్న పర్మిషన్ గొడవలా అనిపించొచ్చు కానీ, కానీ అసలు అవసరం పవర్ తో ఉంది. ఒక్కసారి ఆలోచిచండి..అసలు ఈ AI డేటా సెంటర్లకు అంత కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రిడ్ కరెంట్ రాకపోతే AI ఆగిపోవాల్సిందేనా?
బ్రిడ్జ్ పవర్… అంటే మధ్యలో ఓ జుగాడ్!
డేటా సెంటర్ అంటే కేవలం నాలుగు గోడలు, పైన కప్పు మాత్రమే కాదు. లోపల వేలాది GPUలు, నైట్ అండ్ డే నడిచే సర్వర్లు, కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. బిల్డింగ్ పూర్తికాగానే గ్రిడ్ నుంచి అంత భారీ కరెంట్ కనెక్షన్ రావడం కాస్త లేట్ అవ్వొచ్చు. ఆ గ్యాప్‌లోనే కంపెనీలు ఇలా సొంత జనరేటర్లతో కరెంట్ పుట్టించుకుంటాయి. దాన్నే సాంకేతిక భాషలో “బ్రిడ్జ్ పవర్” అంటారు. అంటే గ్రిడ్ కరెంట్ వచ్చేదాకా నడిపించే ఒక తాత్కాలిక ఏర్పాటన్నమాట.
AI రేసులో సరికొత్త విలన్… పవర్ కట్!
ఇప్పటిదాకా AI అంటే మనకి చిప్స్, మోడల్స్, డేటా సెంటర్లు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు కథ మారింది. ఎంత పవర్ఫుల్ చిప్స్ ఉన్నా, ఎన్ని డేటా సెంటర్లు కట్టినా… వాటిని నడిపించడానికి విద్యుత్ లేకపోతే అవన్నీ ఉత్తి డబ్బాలే! అందుకే మున్ముందు డేటా సెంటర్ ఎక్కడ కట్టాలన్నా “అక్కడ భూమి ఉందా? ఇంటర్నెట్ బాగుందా?” అని మాత్రమే చూడరు, “మాకు కావాల్సినంత కరెంట్ ఇక్కడ దొరుకుతుందా?” అని ముందుగా ఆరా తీయాల్సిందే.
డీజిల్ వద్దు… నేచురల్ గ్యాస్ ముద్దు! (కానీ ఇక్కడా చిక్కే)
డేటా సెంటర్లకు బ్యాకప్ అంటే దశాబ్దాలుగా డీజిల్ జనరేటర్లే దిక్కు. కాకపోతే వాటి వల్ల విపరీతమైన కాలుష్యం. అందుకే ఈ మధ్య నేచురల్ గ్యాస్ జనరేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కొంత తక్కువ ఖర్చుతో, కాస్త తక్కువ కాలుష్యంతో నడుస్తాయి. అయితే వీటికీ ఒక తిరకాసు ఉంది. ఏదైనా పెద్ద తుపాను వచ్చి గ్యాస్ పైప్లైన్లు దెబ్బతింటే, ఇంధనం అందక ఇవీ చేతులెత్తేస్తాయి. అంటే ఇప్పుడు “కరెంట్ ఉందా లేదా?” అన్నది మాత్రమే కాదు, “ఆ కరెంట్ ఎంత నమ్మకమైనది? దానివల్ల ఎంత కాలుష్యం వస్తోంది?” అనేది పెద్ద పంచాయితీగా మారింది.
ఇవి కూడా చదవండి
జనరేటర్ ఉంటే సరిపోదు… రూల్స్ చాలా గట్టివి!
సొంతంగా జనరేటర్ ఉంటే సరిపోదు, మనకిష్టమొచ్చినట్లు నడపడానికి కుదరదు. అమెరికాలో పర్యావరణ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. జనరేటర్ ఎంత కాలుష్యం బయటకు వదులుతోంది? దాంతో రోజుకి ఎన్ని గంటలు కరెంట్ తీస్తున్నారు? అది కేవలం అత్యవసర బ్యాకప్ కోసమా లేక రోజంతా దాంతోనే నడిపిస్తున్నారా? అనే దాన్ని బట్టి పర్మిషన్లు ఇస్తారు. నిరంతరం దాంతోనే నడపాలంటే ‘టియర్ 4’ అనే అత్యంత కఠినమైన కాలుష్య రహిత ప్రమాణాలను పాటించాల్సిందే.
డెడ్లైన్లు… కఠిన చట్టాలు!
న్యూజెర్సీ అధికారుల తనిఖీల్లో ఈ 62 జనరేటర్లు దొరికిపోవడంతో, ‘డేటా వన్’ కంపెనీకి పర్మిషన్లు తెచ్చుకోవడానికి 45 రోజుల టైమ్ ఇచ్చారు. కుదరకపోతే ఆ జనరేటర్లు బంద్ చేయాల్సిందే! మరోవైపు వర్జీనియా వంటి చోట్ల కూడా డేటా సెంటర్ జనరేటర్ల కోసం కొత్తగా అత్యంత కఠినమైన కాలుష్య చట్టాలు తీసుకొస్తున్నారు. అంటే AI ఎంత వేగంగా దూసుకెళ్తోందో, దానికి అడ్డుకట్ట వేసే పర్యావరణ నియమాలు కూడా అంతే స్పీడుగా వస్తున్నాయి.
మన జేబుకేం సంబంధం?
AI అంటే మనకు ఉచితంగా వచ్చే ChatGPT, లేదా సరదాగా క్రియేట్ చేసే AI ఇమేజ్‌లు, వీడియోలే అనుకుంటాం. కానీ ఆ ఒక్క చిన్న సెర్చ్ వెనుక… సర్వర్లు, GPUలు, కూలింగ్, డేటా సెంటర్లు, కరెంట్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక పెద్ద సామ్రాజ్యమే పనిచేస్తోంది. మరి AI కోసం పెంచుకుంటూ పోతున్న ఈ భారీ విద్యుత్ ఖర్చులను చివరికి ఎవరు భరిస్తారు? కంపెనీలా, ప్రభుత్వాలా, లేక కరెంట్ బిల్లుల రూపంలో, AI సబ్స్క్రిప్షన్ల రూపంలో మనలాంటి సామాన్య వినియోగదారుల జేబులోంచే తీస్తారా? అసలు సిసలు సస్పెన్స్ ఇక్కడే ఉంది!
మోడల్స్ వార్ ముగిసింది… ఇక పవర్ వార్!
ఇన్నాళ్లూ “ఎవరి AI మోడల్ గొప్పది? ఎవరి చిప్ వేగంగా పనిచేస్తుంది?” అనే పోటీ నడిచింది. కానీ రాబోయే రోజుల్లో “ఎవరి దగ్గర ఎక్కువ కరెంట్ ఉంది?” అనేదే అసలైన రేస్ కాబోతోంది. ఎందుకంటే డబ్బులుంటే GPUలు కొనొచ్చు, డేటా సెంటర్లు కట్టొచ్చు. కానీ ఓ విద్యుత్ గ్రిడ్‌ను రాత్రికి రాత్రే కట్టేయలేం కదా!
అందుకే ఈ 10 కోట్ల ఫైన్ అనేది కేవలం ఒక కంపెనీ పర్మిషన్ల గొడవ కాదు… రాబోయే పెద్ద ‘కరెంట్ సెగ’కు చిన్న శాంపిల్ మాత్రమే. AIకి భవిష్యత్తు కావాలి, ఆ భవిష్యత్తు నడవాలంటే కరెంట్ కావాలి. మరి ఆ వెలుగుల కోసం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత కాలుష్యాన్ని భరించాలి అనేది రాబోయే రోజుల్లో తేలాల్సిన అసలైన ప్రశ్న!








