కొరటాల సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్
నందమూరి బాలకృష్ణ(NBK), డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కథ, బాలయ్య పాత్రకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాకపోవడంతో ప్రతి చిన్న అప్డేట్ ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. తండ్రి, కొడుకు పాత్రలను బాలయ్యే పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు పాత్రల మధ్య ఉండే బాండింగ్, ఎమోషన్స్ చుట్టూ కథ సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, కథలో రాజకీయ అంశాలను కూడా కీలకంగా మిళితం చేసినట్లు సమాచారం. కొరటాల శివ దేవర(Devara) తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో స్క్రిప్ట్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తోంది. బాలయ్య కోసం గతంలో కనిపించని విధంగా సరికొత్త లుక్‌ను కూడా రెడీ చేస్తున్నారట.
ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న బాలకృష్ణ త్వరలోనే షూటింగ్‌కు రెడీ కానున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ను డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలయ్యను కొత్తగా చూపించేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నారని టాక్. అయితే డ్యూయల్ రోల్‌కు సంబంధించిన వివరాలపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.








