చిరంజీవి Netflixలోకి వస్తే.. అసలు లాభం ఎవరికి? ఈ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు కథ!
ఇన్నాళ్లూ డిజిటల్ రంగానికి, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉంటూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఎట్టకేలకు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త అంతటా వినిపిస్తోంది. అది కూడా గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తో కలిసి ఒక భారీ టాక్ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. అయితే బిగ్ స్క్రీన్ మీద దశాబ్దాలుగా ఏలిన,ఇంకా ఏలుతున్న మెగాస్టార్ ను నెట్‌ఫ్లిక్స్ ఒప్పించడం, ఆయన ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక కేవలం ఒక షో చేయడమేనా లేక అంతకంటే పెద్ద వ్యూహం దాగి ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది.
నిజానికి చిరంజీవి-నెట్‌ఫ్లిక్స్ డీల్ దాదాపు ఓకే అయ్యిందని రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఇరు వర్గాల నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాబట్టి ప్రసార తేదీలు, గెస్టులు, రెమ్యునరేషన్ల వివరాలు పక్కన పెట్టి చూస్తే, అసలు ఇన్నాళ్లూ ఓటీటీకి దూరంగా ఉన్న చిరంజీవిని నెట్‌ఫ్లిక్స్ ఎలా ఒప్పించగలిగింది? ఈ కాంబినేషన్ వెనుక ఉన్న అసలు బిజినెస్ ప్లాన్ ఏమిటి? అనే విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.
హాలీవుడ్ నుంచి దిగుమతి అయిన పాత ఫార్ములా
మనకిది కొత్తగా అనిపించవచ్చు కానీ, నెట్‌ఫ్లిక్స్ కు సెలబ్రిటీలతో సంభాషణలు జరిపే ఈ ఫార్మాట్ అసలు కొత్త కాదు. ప్రపంచ ప్రఖ్యాత యాంకర్ డేవిడ్ లెటర్‌మన్ తో నిర్మించిన “మై నెక్స్ట్ గెస్ట్ నీడ్స్ నో ఇంట్రడక్షన్” షో ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఒబామా, జార్జ్ క్లూనీ, మలాలా లాంటి ప్రముఖులతో ఆయన చేసిన సంభాషణలను నెట్‌ఫ్లిక్స్ తనదైన శైలిలో రూపొందించింది. ఆ తర్వాత జాన్ ములానీతో చేసిన లైవ్ వెరైటీ షోలో అతన్ని కేవలం హోస్ట్ గానే కాకుండా షో రన్నర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పెట్టి నడిపించారు. అంటే నెట్‌ఫ్లిక్స్ ఆలోచన ప్రకారం టాక్‌షో అనేది కేవలం ఇద్దరు సెలబ్రిటీలు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం కాదు, ఒక బలమైన స్టార్డమ్ ను నిరంతరం ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక బ్రాండ్ ప్రాపర్టీగా మార్చడం. సరిగ్గా ఇక్కడే చిరంజీవి ఎంపిక అత్యంత ఆసక్తికరంగా మారుతుంది.
చిరంజీవి నుంచి నెట్‌ఫ్లిక్స్ ఏం కోరుకుంటోంది?
ఒక కొత్త నటుడితో నెట్‌ఫ్లిక్స్ సినిమా తీస్తే ఆ కథను కొంటుంది, ఒక కామేడియన్ తో షో చేస్ అతని ప్రదర్శనను కొంటుంది. కానీ చిరంజీవితో టాక్ షో చేస్తే వారికి దొరికేది అసలైన ఆస్తి…అదే చిరంజీవి అనే వ్యక్తిని తెలుసుకోవాలనే ప్రేక్షకుల కుతూహలం. నాలుగు దశాబ్దాలకు పైగా విస్తరించిన ఆయన సినీ ప్రయాణంలో వందలాది మంది నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో అనుబంధం ఉంది. తెలుగు సినిమా పరిణామాన్ని స్వయంగా చూసిన వ్యక్తి ఆయన. అలాంటి ఒక లెజెండ్ ఒక అతిథిని ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రేక్షకుడు కేవలం గెస్ట్ చెప్పే సమాధానం కోసమే కాకుండా “చిరు ఏమని అడుగుతారు?” అనే ఆసక్తితో షో చూస్తాడు. సాధారణ ఇంటర్వ్యూకి, ఒక మెగాస్టార్ హోస్ట్ చేసే షోకి ఉన్న వ్యత్యాసం ఇదే.
నెట్‌ఫ్లిక్స్ కి దక్కే అసలు బిజినెస్ అడ్వాంటేజ్
భారతీయ మార్కెట్లో ప్రాంతీయ కంటెంట్ ఎంత కీలకమో నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులు గతంలోనే స్పష్టం చేశారు. అలాంటి సమయంలో ఇన్నాళ్లూ ఓటీటీకి దూరంగా ఉన్న చిరంజీవిని తమ ప్లేట్ ఫామ్ పైకి తీసుకురావడం వల్ల నెట్‌ఫ్లిక్స్ కు ప్రధానంగా మూడు లాభాలు ఉన్నాయి. మొదటిది, సినిమా అయితే రెండు మూడు గంటల్లో ముగిసిపోతుంది, కానీ టాక్‌షో హిట్టయితే అది వారం వారం చూసే ఒక అలవాటుగా మారుతుంది. రెండోది, చిరంజీవికి సౌత్ మొత్తంలో ఉన్న ఇమేజ్ వల్ల ఈ షోను సబ్ టైటిల్స్, డబ్బింగ్ ద్వారా ఇతర భాషలకూ సులభంగా తీసుకెళ్లవచ్చు. దీనివల్ల ఇదొక సౌత్ ఇండియన్ సెలబ్రిటీ ప్రాపర్టీగా మారిపోతుంది. మూడోది, సోషల్ మీడియా మార్కెటింగ్. ఒక గంట ఎపిసోడ్ నుంచి 10 నిమిషాల యూట్యూబ్ క్లిప్స్, 30 సెకన్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్, వైరల్ మీమ్స్ తయారు చేసి వారాల తరబడి ఫ్రీ ప్రచారం పొందవచ్చు. ఒకసారి ప్రొడక్షన్ ఖర్చు పెడితే, నెట్‌ఫ్లిక్స్ కి వారాల తరబడి మార్కెటింగ్ మెటీరియల్ దొరుకుతుంది.
ఇవి కూడా చదవండి
మెగాస్టార్ కి వచ్చే లాభం ఏంటి?
మరి ఈ డీల్ వల్ల చిరంజీవికి దక్కేది ఏమిటంటే, నటుడిగా ఉన్న తన బ్రాండ్ ను మరో కొత్త డిజిటల్ కోణంలోకి తీసుకెళ్లే అవకాశం. సినిమాలో దర్శకుడు రాసిన పాత్రలో నటిస్తారు, కానీ టాక్‌షోలో చిరంజీవి సొంత వ్యక్తిత్వమే అసలైన కంటెంట్ అవుతుంది. తన సుదీర్ఘ ప్రయాణంలో సంపాదించుకున్న సినీ జ్ఞాపకాలను ఒక కంటెంట్ బ్యాంక్ ల మార్చుకోవచ్చు. ఒక ఎపిసోడ్లో సీనియర్ నటుడు, మరో ఎపిసోడ్లో సమకాలీన సూపర్ స్టార్ , ఇంకో దాంట్లో యంగ్ జనరేషన్ హీరోలు—ఇలా చిరు షో చేస్తే అది కేవలం సరదా సంభాషణగా మాత్రమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రను ఆయన కోణంలో రికార్డ్ చేసిన ఒక ఆర్కైవ్లా నిలిచిపోతుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ కి లైబ్రరీ వ్యాల్యూ అయితే, చిరంజీవికి జీవితాంతం నిలిచిపోయే లెగసీ వ్యాల్యూ.
ముందున్న అసలైన సవాలు
అయితే కేవలం చిరంజీవి పేరు చూసి షో సూపర్ హిట్ అయిపోతుందని అనుకుంటే పొరపాటే. ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ కి ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. ఈ షో ఎంతవరకు నిలబడుతుందనేది చిరంజీవి ఎంత సహజంగా మాట్లాడతారు, అతిథుల నుంచి ఎంత కొత్త విషయాలను రాబట్టగలరు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. రొటీన్ గా “మీ తదుపరి సినిమా ఏంటి?”, “ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?” అని ప్రమోషనల్ తరహాలో అడిగితే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. అలా కాకుండా “ఆ రోజు మీరు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?”, “మీ కెరీర్లో మార్చుకోవాలనుకునే ఘట్టం ఏది?” అని వ్యక్తిగత, ఆలోచనాత్మకమైన ప్రశ్నలు వేస్తేనే ఈ షోకి అసలైన కంటెంట్ వ్యాల్యూ పెరుగుతుంది.
సినిమాలకు ప్రత్యామ్నాయం కాదు, కొత్త ప్లాట్ ఫామ్!
ఇది చిరంజీవి సినిమా కెరీర్‌కి ప్రత్యామ్నాయం ఎంతమాత్రమూ కాదు, ఆయన స్టార్ డం కు అదనంగా తోడయ్యే మరో కంటెంట్ లేయర్ మాత్రమే. సినిమా ఒక క్యారెక్టర్ ను అమ్ముతే, టాక్ షో ఆయన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. ఓటీటీ యుగంలో ఒక సూపర్ స్టార్ తన క్రేజ్ ను ఎలా కాపాడుకోవాలి, ఎలా విస్తరించుకోవాలి అనడానికి ఇదొక చక్కటి వ్యూహం. ఒకప్పుడు సినిమాల్లో పాత్రలు పోషించిన మెగాస్టార్, ఇప్పుడు తన ఇన్నేళ్ల సినీ జీవితాన్నే ఒక గ్లోబల్ కంటెంట్ ప్రాపర్టీగా మారుస్తున్నారు. కాబట్టి ఈ ప్రయోగం నిజంగా కార్యరూపం దాల్చితే, అది ఎన్ని వ్యూస్ తెచ్చిందనే దానికంటే “చిరంజీవి” అనే థియేట్రికల్ బ్రాండ్ ను డిజిటల్ ప్రపంచం ఎంతవరకు స్కేలబుల్ ఐపీగా మార్చగలిగిందనేదే అసలైన వ్యాపార విజయమవుతుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








