అమిత్ షా తెలంగాణ టూర్… ఏంటి సంగతి?
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా పర్యటన కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ హైకమాండ్ ప్రత్యేక వ్యూహాలకు పదును పెడుతోంది.
ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడానికి “సడక్ సే సదన్ తక్” కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా కరీంనగర్, మెదక్ జిల్లాలలో పర్యటించనున్నారు. కరీంనగర్లోని ప్రతిమ కాలేజ్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ప్రతిమ గ్రూప్ కు బీఆర్ఎస్ అనుకూలం అనే పేరుంది. అలాంటి సంస్థ కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే మెదక్ జిల్లాలో అమూల్ డైరీకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం పనిచేస్తోంది. కర్ణాటకలో మాదిరిగానే ఇక్కడ కూడా మిషన్ మోడ్ లో కార్యకలాపాలు సాగిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నేతృత్వంలో పార్టీ యంత్రాంగం దూకుడు పెంచింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా అమిత్ షా పర్యటన సాగనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. అమిత్ షా పర్యటన ద్వారా పార్టీ క్యాడర్లో జోష్ నింపాలని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అనుసరిస్తున్న ఈ రాజకీయ వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.








