కేటీఆర్‌కు ఏసీబీ షాక్! ఫార్ములా కేసులో బిగిస్తున్న ఉచ్చు!?
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా-ఈ రేస్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంలో చట్టపరమైన ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సహా నలుగురి పాస్‌పోర్ట్‌లను తాత్కాలికంగా జప్తు ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇదిప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గత బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా-ఈ రేస్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అయితే ఇందులో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రూ. 55 కోట్ల ప్రభుత్వ నిధులను విదేశీ సంస్థకు అక్రమంగా బదలాయించారన్నది ప్రధాన అభియోగం. ఈ అక్రమ లావాదేవీలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించి, సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ కేటీఆర్‌తో పాటు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్‌కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు.. ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రతినిధి అల్బర్ట్ లొంగోలపై 2024 డిసెంబర్లో కేసులు నమోదు చేసింది. నిందితులను విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేయడంతో పాటు, కోర్టులో అభియోగపత్రాలు కూడా దాఖలు చేసింది. ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో .. నిందితులు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఏసీబీ దూకుడు పెంచింది.
ఇవి కూడా చదవండి
మొత్తం ఐదుగురు నిందితులలో నలుగురి పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టును కోరింది. దీంతో న్యాయస్థానం హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఆ మేరకు లేఖ రాసింది. ఐదో నిందితుడు విదేశీయుడు కావడంతో ఇక్కడి చట్టాల పరిధిలో ఆయన పాస్‌పోర్ట్‌ను జప్తు చేసే అధికారం స్థానిక అధికారులకు లేదు. ఏదైనా క్రిమినల్ నేరం నమోదైనప్పుడు, దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు లేదా న్యాయస్థానం ఆదేశాలతో నిందితులు విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్ట్‌లను తాత్కాలికంగా జప్తు చేయించే అధికారిక వెసులుబాటు ఆర్డీవోకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ద్వారా ఆర్డీవోకు లేఖ పంపడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు ఇలాంటి పాస్‌పోర్ట్ జప్తు అస్త్రాలను ప్రయోగిస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. మరోవైపు ప్రజాధనం దుర్వినియోగం అయితే చూస్తూ ఊరుకోబోమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు అంశం తెరపైకి రావడంతో ఈ కేసు తదుపరి విచారణ ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి.








