ఇంట్లో లభించే ఈ 5 ఎరువులతో.. బంతి పూలు పెద్దగా, ఎక్కువగా పూసేలా చేయండి!
ఇంట్లో బంతి మొక్కను పెంచుతూ, నిండుగా పసుపు, నారింజ రంగు పూలు పూయాలని చాలామంది కోరుకుంటారు. కానీ మొక్క ఏపుగా పెరిగినా పూలు తక్కువగా వస్తుంటే నిరాశ కలుగుతుంది. ఖరీదైన ఎరువులకంటే ఇంట్లో లభించే సేంద్రియ పదార్థాలను సరిగ్గా ఉపయోగించడం, తగినంత ఎండ అందించడం మొక్క పుష్పించడానికి తోడ్పడతాయి.
అరటి తొక్కల ఎరువు, ఉల్లిపాయ తొక్కల రసం

అరటి తొక్కల్లో పొటాషియం ఉంటుంది. ఇది మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుంది. ఎండిన అరటి తొక్కలను పొడి చేసి మొక్క మొదట్లో వేయవచ్చు. లేదా 3–4 అరటి తొక్కలను ఒక లీటరు నీటిలో రెండు రోజులు నానబెట్టి, ఆ నీటిని వడకట్టి మొక్కలకు పోయవచ్చు.
ఉల్లిపాయ తొక్కలతో కూడా ఇంట్లోనే ద్రవ ఎరువును తయారు చేసుకోవచ్చు. గుప్పెడు ఉల్లిపాయ తొక్కలను లీటరు నీటిలో 24–48 గంటలు నానబెట్టి, తొక్కలను వేరు చేసి ఆ నీటిని మొక్క మొదట్లో పోయవచ్చు. అయితే ఈ ద్రవాలను వారానికి ఒకసారి వాడటం తప్పనిసరి కాదు; మొక్క అవసరాన్ని బట్టి పరిమితంగా ఉపయోగించాలి..
వాడేసిన టీ పొడి, బియ్యం–పప్పులు కడిగిన నీరు

టీ పొడిలో కొంత నత్రజని, ఇతర పోషకాలు ఉంటాయి. వాడేసిన టీ పొడిని చక్కెర, పాలు లేకుండా బాగా కడిగి, పూర్తిగా ఎండబెట్టుకోవాలి. ఈ పొడిని నెలకు రెండుసార్లు ఒకట్రెండు స్పూన్లు మొక్క మొదట్లో వేసి మట్టిలో కలపవచ్చు.
బియ్యం, పప్పులు కడిగిన నీటిని కూడా బంతి మొక్కకు ఉపయోగించవచ్చు. ఈ నీటిని ఎక్కువకాలం నిల్వ ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే మొక్కకు పోయడం మంచిది. అయితే ఈ పదార్థాల వల్లే ఎక్కువ కొమ్మలు, పూలు వస్తాయని చెప్పలేం. సరైన సూర్యరశ్మి, నీరు, సమతుల్య పోషకాలు కూడా అవసరం.
బంగాళాదుంప తొక్కల నీరు, ఆవ పిండి ద్రవ ఎరువు

బంగాళాదుంప తొక్కల్లో పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. తొక్కలను నీటిలో ఉడికించి లేదా రెండు రోజులు నానబెట్టి, ఆ నీటిని పూర్తిగా చల్లార్చిన తర్వాత మొక్కకు అందించవచ్చు. అయితే ఈ నీరు ఒక్కటే పూల ఉత్పత్తిని వేగవంతం చేస్తుందని చెప్పలేం.
ఇవి కూడా చదవండి
ఆవ పిండిలో మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్ ఆవ పిండిని కలిపి 24 గంటలు ఉంచాలి. తర్వాత మరింత నీటితో పలుచగా చేసి, మొదట తక్కువ మోతాదులో వేర్ల చుట్టూ ఉన్న మట్టికి అందించాలి. కాండానికి నేరుగా పోయకూడదు. తరచుగా లేదా అధిక మోతాదులో వాడకుండా, ఇతర ఎరువులతో కలిపి పోషకాలు మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తపడాలి.
బంతి పూలు ఎక్కువగా పూయడానికి ఎండ, పించింగ్ చిట్కాలు

బంతి మొక్కకు రోజుకు కనీసం 6 గంటల సూర్యరశ్మి, నీరు నిలవని మట్టి అవసరం. పూలు వాడిపోయినప్పుడు వాటిని తొలగించడం వల్ల కొత్త పూలు రావడానికి తోడ్పడుతుంది. ఎరువులను అతిగా వేయకూడదు. ముఖ్యంగా నత్రజని ఎక్కువైతే ఆకులు, కొమ్మలు ఎక్కువగా పెరిగి పూలు తగ్గవచ్చు.
చిన్న బంతి మొక్కలో పైభాగంలోని పెరుగుతున్న చివరను స్వల్పంగా తొలగించే పద్ధతిని పించింగ్ (Pinching) అంటారు. దీనివల్ల పక్క కొమ్మలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కొమ్మలు పెరిగితే పూలు వచ్చే ప్రదేశాలు కూడా పెరగవచ్చు.








