‘హనుమాన్ అంశ్’ హిట్ తర్వాత నీమ్ కరోలి బాబా కథకు కొత్త మార్కెట్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రూ.1.8 కోట్లతో ఒక చిన్న సినిమా తీస్తే, దానికి మొదటి రోజు వచ్చిన కలెక్షన్ .. కేవలం 10 లక్షలు! రిలీజ్ రోజు జనం లేరు…వీకెండ్ లో పరిస్దితి దారుణం. థియేటర్లు ఖాళీగా ఉండటంతో 300 థియేటర్ల నుంచి ఏకంగా 30కి తగ్గించేశారు. కథ ఇక ముగిసిపోయిందిలే అనుకుంటున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. చూసిన కొద్దిపాటి జనాలు ఒకరికొకరు బాగుందని చెప్పుకోవడంతో మౌత్ టాక్ మొదలైంది. అతి కొద్ది సమయంలోనే అది విపరీతంగా పెరిగిపోయింది. జనాలు థియేటర్లకు క్యూ కట్టడం మొదలుపెట్టారు. అలా ఊపందుకున్న ఆ చిత్రం, ఏకంగా 55 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది. అదే ‘హనుమాన్ అంశ్’ చిత్రం.
చిన్న సినిమా సృష్టించిన సంచలనం
ఆగస్టు 7న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, ఆ తర్వాత బాక్సాఫీస్ లెక్కలన్నింటినీ తిరగరాసింది. కేవలం రెండు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం Sacnilk లెక్కల ప్రకారం ఒక్క ఇండియాలోనే రూ.314 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. హిందీ బెల్ట్‌లో ప్రేక్షకులు ఈ ఆధ్యాత్మిక చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. నిశ్శబ్దంగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఏకంగా నీమ్ కరోలి బాబా జీవితంపై మిగతా ఎంటర్టైన్మెంట్ సంస్థల దృష్టి పడేలా చేసింది.
View this post on Instagram
Sony ఎంట్రీతో కొత్త ఉత్కంఠ
‘హనుమాన్ అంశ్’ సృష్టించిన ప్రభావాన్ని చూసి ప్రముఖ దిగ్గజ సంస్థ Sony చటుక్కున రెస్పాండ్ అయింది. నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనలు, హనుమంతుడిపై ఆయనకున్న అపారమైన భక్తికి సంబంధించిన కథలు ఆధారంగా చేసుకుని Sony Entertainment Television, SonyLIV సంయుక్తంగా ఒక భారీ మైథో-ఫిక్షన్ సిరీస్‌ను ప్రకటించాయి. మళ్లీ వేరే వాళ్లు ఈ ట్రెండ్ ని క్యాష్ చేసుకోకడదు అన్నట్లుగా…అర్జెంటుగా సెప్టెంబర్ 30న ఒక ప్రోమో కూడా వదిలాయి.
ఆ ప్రోమోలో నీమ్ కరోలి బాబాను పోలిన ఓ వృద్ధుడు నదీ తీరాన నడుస్తూ ఆకాశం వైపు చేతులెత్తగానే హనుమంతుడి రూపం కనిపించడం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. అయితే ఇందులో నటించే నటీనటులు ఎవరు, ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలను మాత్రం ఇంకా సీక్రెట్‌గానే ఉంచారు.
అసలు ఎవరీ నీమ్ కరోలి బాబా?
1900లో జన్మించి 1973 వరకు జీవించిన నీమ్ కరోలి బాబా (మహరాజ్జీ) మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మిలియన్ల మంది భక్తులను సంపాదించుకున్న గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఆయన జీవితంలోని విచిత్ర ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా డాక్టర్ విశాల్ చతుర్వేది రాసిన ‘Divine Detour: That Changed My Life’ అనే పుస్తకం ఆధారంగానే ఈ ‘హనుమాన్ అంశ్’ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో శోభినావ్ సత్యా, నీమ్ కరోలి బాబా పాత్రలో జీవించేశారు. ఏ రకమైన ప్రమోషన్లు లేకపోయినా, ఈ సినిమా ద్వారా బాబా గారి గురించిన విషయాలు ఈతరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
తెలుగు రిలీజ్
ఇదిలా ఉంటే, హిందీలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. మొదట సెప్టెంబర్ 18న విడుదల చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబర్ 9న హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెలుగులో విడుదల చేస్తోంది. మరి హిందీలో రూ.400 కోట్లు కొల్లగొట్టిన ఈ ఆధ్యాత్మిక మేజిక్, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి!








