రివ్యూ: యువతకు ‘తెల్లకాగితం’ మంచి సందేశం
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : అరుణాచల క్రియేషన్స్
నటీనటులు: హర్ష్ రోషన్, నక్షత్ర, అజయ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, శరణ్య ప్రదీప్ తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ : K. V. గుహన్,
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా,
కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, కో-డైరెక్టర్: రమేష్ బోనం,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సూర్నెడ్డి,
కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు : నందు సవిరిగాన
నిర్మాత : కృష్ణ కొమ్మాలపాటి
దర్శకత్వం : రమేష్ బండ్రెడ్డి
విడుదల తేది :02.10.2026
నిడివి : 2 ఘంటల 36నిముషాలు
‘కోర్ట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్.. ఆ తర్వాత యూత్‌ఫుల్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు నక్షత్రతో కలిసి ‘తెల్లకాగితం’ సినిమాలో నటించాడు. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీనేజ్ వయసులో తెలియక తీసుకునే నిర్ణయాలు, వాటి ప్రభావం, ప్రేమ, కుటుంబ బంధాలు వంటి అంశాలను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ‘తెల్లకాగితం’ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?సమీక్షలో చూద్దాం.
కథ :
రాము (హర్ష్ రోషన్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. అన్న, వదిన సంరక్షణలో పెరుగుతాడు. పదో తరగతి చదువుతున్న సమయంలో తన సహ విద్యార్థిని ఆశ (నక్షత్ర)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఆశ కూడా రామును ప్రేమిస్తుంది. అయితే ఇద్దరూ టీనేజ్ వయసులో ఉండటంతో.. ఆ వయసుకు సహజమైన అమాయకత్వంతో కొన్ని తప్పటడుగులు వేస్తారు. ఆ నిర్ణయాలు వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతాయి. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా సమస్యను తామే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రాము, ఆశ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? వారి నిర్ణయాల ప్రభావం కుటుంబంపై ఎలా పడింది? చివరకు వారి ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటుల హావభావాలు :
హర్ష్ రోషన్ రాము పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. టీనేజ్ కుర్రాడి అమాయకత్వం, ప్రేమ, అయోమయం వంటి భావాలను తన హావభావాలతో చక్కగా చూపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. నక్షత్రకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. కొత్త నటిగా కనిపించకుండా ఆశ పాత్రలో అతి సహజంగా ఓ పక్కింటి అమ్మాయిలా నటించింది. అమాయకత్వంతో కూడిన పాత్రను చక్కగా పోషించింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. అజయ్ మెడికల్ స్టోర్ మూర్తి పాత్రలో మెప్పించాడు. హీరో స్నేహితుడి పాత్రలో నటించిన కుర్రాడు కూడా తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. శరణ్య ప్రదీప్ వదిన పాత్రలో సహజంగా నటించింది. రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మరోసారి తన వర్క్ తో ఇంప్రెస్ చేశారు. పాటలు, నేపథ్య సంగీతం కూడా బాగుంది. కె.వి. గుహన్ కెమెరా వర్క్ బాగుంది, యుక్త వయసులో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే పాయింట్‌తో ‘తెల్లకాగితం’ తెరకెక్కింది. రచయిత నందు సవిరిగాన ఎంచుకున్న కథాంశం ప్రస్తుత సమాజానికి సంబంధించిన అంశాలను టచ్ చేస్తుంది. టీనేజ్‌లో తెలియక చేసే తప్పులు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని ప్రధానంగా తీసుకున్నారు. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఈ పాయింట్‌ను ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో మేళవించి తెరకెక్కించాడు. మనసు ఒక తెల్లకాగితంలా ఉంటుందని.. దానిపై రాసుకునే అనుభవాలు, నిర్ణయాలు జీవితాన్ని ఎలా మార్చగలవో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఉన్నట్లుగా క్లైమాక్స్ లేకపోతే, అది యువత పొరపాట్లు చేయడానికి ప్రోత్సహించేలా తప్పుడు సంకేతాలను పంపేది. అయితే, సెకండ్ హాఫ్ కూడా ఫస్టాఫ్ లా ఆకట్టుకునేలా ఉంటే బాగుణ్ణు. అలాగే ఎడిటింగ్ లో రన్ టైం పై కూడా కేర్ తీసుకోవాల్సింది.ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
విశ్లేషణ:
హీరో, హీరోయిన్ మధ్య పరిచయం ప్రేమగా మారే సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. వారి మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తుంది. యూత్‌ను ఆకట్టుకునేలా పాటలను కూడా రూపొందించారు. ముఖ్యంగా రెండు పాటలు సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే, ‘తెల్ల కాగితం’ ఒక రొటీన్ యూత్ ఫుల్ డ్రామాగా నిలిచింది. ఫస్టాఫ్ లో కథనం ఓకే కానీ సెకాండాఫ్ లో మాత్రం కథనం నెమ్మదించింది. కొన్ని సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సీన్స్ అంతే ఇబ్బంది పెట్టాయి. హర్ష్ రోషన్, నక్షత్రల సహజమైన నటన, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్, కుటుంబ భావోద్వేగాలు, చివర్లో వచ్చే సందేశం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. యువ జంట బాగానే పెర్ఫామ్ చేశారు. సెకండాఫ్ ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. దీనితో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.








