కొరియా,జపాన్ ల లో దుమ్మురేపుతున్న ఈ యాప్.. ఇండియాలోకి వస్తే Gen Zను ఆపడం కష్టమే!
మామూలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మంచి ఫోటో లేదా రీల్ పోస్ట్ చేయాలంటే మనవాళ్లు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. పదుల సంఖ్యలో టేకులు తీసుకోవడం, పర్ఫెక్ట్ ఫిల్టర్ ఎంచుకోవడం, లైటింగ్ సెట్ చేసుకోవడం.. ఇవన్నీ పూర్తయ్యేసరికి గంటల సమయం గాయబ్ అవుతుంది. అయితే, ఈ హంగామా మొత్తానికి చెక్ పెడుతూ సరికొత్త సోషల్ మీడియా యాప్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే కొరియా, జపాన్ దేశాల్లోని యూత్ ఈ కొత్త యాప్‌కు పిచ్చపిచ్చగా కనెక్ట్ అయిపోయారు. ఇటీవల అమెరికాలోనూ అడుగుపెట్టిన ఈ క్రేజ్, రేపు పొద్దున మన ఇండియాలోకి వస్తే ఇక్కడి జెన్ జీ యూజర్లను ఆపడం ఎవరి వల్లా కాదు. అసలు ఇన్‌స్టాగ్రామ్‌నే భయపెడుతున్న ఆ యాప్ ఏంటి, అందులో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
గంటకో రెండు సెకన్లు.. స్నేహితుల రోజంతా మన కళ్లముందే!
మీ ఫ్రెండ్స్ గ్రూప్‌ను ఒక్కసారి మనసులో ఊహించుకోండి. ఒకడు హైదరాబాద్ మెట్రోలో ఆఫీస్‌కి వెళ్తుంటాడు, ఇంకొకడు బెంగళూరు దాటి ముందుకు కదలని ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాడు. వేరొకడు విజయవాడ కాలేజీ క్లాస్‌రూమ్‌లో బోర్ కొట్టి బెంచ్ మీద తలవాల్చి ఉంటాడు, మరో ఫ్రెండ్ ఏ అమెరికాలోనో ఉదయాన్నే వేడివేడి కాఫీ సిప్ చేస్తూ ఉంటాడు. ఎవరూ ఒకరికొకరు ఫోన్ చేయరు, ఎక్కడున్నావ్ బాస్ అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టరు. కానీ గంటకొకసారి మీ ఫ్రెండ్స్ జీవితంలోంచి కేవలం రెండు సెకన్ల వీడియో క్లిప్ మీ ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది ఏమాత్రం హంగులు లేకుండా ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది. రోజు ముగిసేసరికి ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకాల వీడియోగా మారిపోతాయి.
దక్షిణ కొరియాలో పుట్టిన ‘సెట్లాగ్’ (Setlog) అనే యాప్ ప్రస్తుతం చేస్తున్న మాయ ఇదే. యూత్ ఈ యాప్‌కు ఎంతలా అలవాటు పడిపోయారంటే, జపాన్‌లో కూడా ఇది విపరీతంగా పాపులర్ అయిపోయింది. రీసెంట్గా అమెరికా మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో, తదుపరి టార్గెట్ ఖచ్చితంగా ఇండియానే అయి ఉంటుందని సోషల్ మీడియా ప్రపంచం భావిస్తోంది.
ఫిల్టర్లు లేవు.. ఎడిటింగ్లు అసలే లేవు!
సెట్లాగ్ యాప్ పనిచేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది. యాప్ నుంచి నిర్దిష్ట సమయాల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది రాగానే మీరు ఉన్న చోటు నుంచి కేవలం 2 నుంచి 3 సెకన్ల చిన్న వీడియో తీసి షేర్ చేయాలి, అంతే! ఇందులో ఎలాంటి ఫిల్టర్లు పెట్టడానికి కుదరదు, పాత వీడియోలను గ్యాలరీ నుంచి వెతికి అప్లోడ్ చేయడానికి ఉండదు. అసలు పర్ఫెక్ట్గా సిద్ధమై కెమెరా ముందుకు రావలసిన అవసరమే లేదు. ఆ క్షణంలో మీరు బస్సులో ఉన్నారా, కాఫీ తాగుతున్నారా, క్లాస్‌లో నిద్రపోతున్నారా లేదా మంచం మీద పడుకున్నారా అనేది అలాగే రికార్డ్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ కోసం ప్రత్యేకంగా ‘లాగ్ రూమ్స్’ క్రియేట్ చేసుకుంటే, యాప్ ఆటోమేటిక్‌గా ఆ రోజు క్లిప్పింగ్స్ అన్నింటినీ కలిపి ఒక క్యూట్ బ్లాగ్‌గా మార్చేస్తుంది. అంటే మీ రోజంతా ఎలా గడిచిందో మీరేమీ కష్టపడి ఎడిట్ చేయనక్కర్లేదు, సెట్లాగే ఆ పని పూర్తి చేస్తుంది.
ఇన్స్టాగ్రామ్ విసుగుకు సరైన ప్రత్యామ్నాయం
మనకు సోషల్ మీడియా అనగానే “నీ బెస్ట్ వర్షన్ మాత్రమే అందరికీ చూపించు” అనే అలవాటు అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో పెట్టాలంటే ఇరవై టేకులు తీసి, అందులో ఏది బాగుందో వెతికి, చివరికి ఫిల్టర్లు జోడించి పోస్ట్ చేస్తాం. ఒక చిన్న రీల్ కోసం గంటల తరబడి సమయం వృధా చేస్తాం. ఈ ఆర్టిఫిషియల్ హడావుడికి యూజర్లు తీవ్రంగా అలసిపోయిన సమయంలో సెట్లాగ్ వచ్చి “అంత కష్టపడకు, నీ జీవితం ఎలా ఉందో అలాగే చూపించు” అని చెబుతోంది. నిజమైన క్షణాలను ఎలాంటి మేకప్ లేకుండా పంచుకోవడమే ఈ యాప్‌ను మిగతా వాటికి భిన్నంగా నిలబెడుతోంది.
ఇవి కూడా చదవండి
ఇన్‌స్టాగ్రామ్‌కు, సెట్లాగ్కు అసలు తేడా ఏంటి?
ఇన్స్టాగ్రామ్ అనేది మన జీవితంలో అత్యంత అందమైన క్షణాలను ప్రపంచం మొత్తానికి చూపించడానికి ఉపయోగపడుతుంది. అక్కడ మనకు ఎక్కువ మంది ఫాలోవర్లు, లైకులు, వ్యూస్ కావాలి. కానీ సెట్లాగ్ అలా కాదు, ఇది కేవలం మీ ఆత్మీయులైన చిన్న ఫ్రెండ్స్ గ్రూప్ కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇందులో హంగులు, ఆర్భాటాలు ఉండవు. ఇన్స్టాగ్రామ్ “నన్ను చూడండి” అని అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటే, సెట్లాగ్ మాత్రం “నాతో ఉండండి” అని స్నేహితులను దగ్గరకు తీసేలా ఉంటుంది. కాబట్టి ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీ అనడం కంటే, సోషల్ మీడియా భావననే మార్చే కొత్త ప్రయత్నంగా చూడవచ్చు.
మనసులను ముడివేసే చిన్న ఎమోషనల్ టచ్
చదువులు, ఉద్యోగాల వల్ల ఈ రోజుల్లో స్నేహితులంతా వేర్వేరు నగరాలకు, దేశాలకు విడిపోతున్నారు. ప్రతిరోజూ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకోవడం అందరికీ సాధ్యపడదు. సెట్లాగ్ సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాచ్ చేసింది. ప్రతి గంటకూ రెండు సెకన్ల వీడియో పంపడం ద్వారా, రోజంతా ఒకరి జీవితంలో మరొకరు భాగమవుతున్నారు. నువ్వు ఆఫీస్‌కి వెళ్లడం, ఫ్రెండ్ కాఫీ తాగడం, ఇంకొకరు వర్షంలో తడవడం.. ఇవన్నీ చూస్తూ ఉంటే అందరూ మన పక్కనే ఉన్నారనే ఒక అద్భుతమైన భావన కలుగుతుంది. ఇక్కడ కంటెంట్ కంటే మనసుల అనుబంధానికే (Connection) ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది.
అంకెల్లో చూస్తే క్రేజ్ మామూలుగా లేదు!
సెట్లాగ్ మొదట కొరియాలో పుంజుకున్నా, జపాన్‌లో వర్కవుట్ అయిన తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల అక్కడ చేసిన ఒక సర్వేలో 91 శాతం మంది విద్యార్థులకు ఈ యాప్ గురించి తెలుసని, అందులో 73 శాతానికి పైగా ఇప్పటికే వాడుతున్నామని చెప్పారు. ప్రత్యేకంగా ప్రకటనలు గుప్పించి ఈ యాప్ ప్రచారం పొందలేదు, కేవలం ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇంకో ఐదుగురు డౌన్లోడ్ చేసుకుంటూ దీన్ని ఒక చైన్ లాగా మార్చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లేస్టోర్‌లో మిలియన్ కి పైగా డౌన్లోడ్లు సాధించి, కొరియా, జపాన్ సరిహద్దులు దాటి ఇతర దేశాలకూ వేగంగా విస్తరిస్తోంది.
ఇండియాలోకి వస్తే జెన్ జీ రచ్చ రంబోలానే!
మన దేశంలో గ్రూప్ కల్చర్, ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా ఎక్కువ. కాలేజీ బ్యాచ్‌లు, హాస్టల్ గ్యాంగ్‌లు, ఆఫీస్ ఫ్రెండ్స్ ఇలా ప్రతీ ఒక్కరికీ పెద్ద పెద్ద స్నేహితుల బృందాలు ఉంటాయి. మన యూత్‌కి ఇప్పటికే రీల్స్, షార్ట్స్ చేయడం అలవాటే కాబట్టి, రోజంతా ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండటానికి ఇలాంటి అన్ఫిల్టర్డ్ యాప్ దొరికితే ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటారు. ప్రదర్శనల కోసం కాకుండా నిజమైన స్నేహం కోసం ఆలోచించే మన భారతీయ జెన్ జీ యూజర్లకు ఈ యాప్ పిచ్చపిచ్చగా నచ్చేసే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో “నా బెస్ట్ లైఫ్ చూడండి” అనే రోజులు పోయి, ఒకరోజు మన ఫ్రెండ్స్ గ్రూప్‌లో…
“ఎక్కడున్నావ్ రా?” అనే మెసేజ్ స్థానంలో… “నీ 2 Seconds పంపు!” అనే మెసేజ్ వస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ మనోళ్లు కూడా దీనికి ఓకే చెబితే, త్వరలోనే ఇండియాలోనూ సెట్లాగ్ పెద్ద సంచలనం కావడం ఖాయం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








