వామ్మో.. ఇన్ని ట్విస్టులా..? ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్టే!
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. దానం నాగేందర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయమే ఇందుకు ప్రధాన కారణం. దానంపై అనర్హత వేటు పడినప్పటికీ, ఆయన ఎన్నికపై దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉన్నందున నియోజకవర్గాన్ని ‘క్యాజువల్ వేకెన్సీ’గా పరిగణించడానికి వీల్లేదని న్యాయ నిపుణులు, సీఈసీ స్పష్టం చేస్తున్నాయి.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 84, 98(సి), 101(బి) నిబంధనల ప్రకారం.. ఒక ఎన్నికల పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు, ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పి.విజయారెడ్డి.. దానం నాగేందర్ విజయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం ఎన్నిక చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆమె ఆ పిటిషన్లో కోరారు.
హైకోర్టులో దాఖలైన ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఎన్నికల పిటిషన్ తేలేదాకా నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు కాదని, అందువల్ల ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయలేమని తేల్చిచెప్పారు. విజయారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఒకవైపు దానంపై అనర్హత వేటు పడినప్పటికీ, ప్రధాన ఎన్నికల పిటిషన్ పెండింగ్లో ఉన్నందున ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో తదుపరి విచారణ వాయిదా పడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక న్యాయపరమైన చిక్కుల్లో పడింది. విజయారెడ్డి వాదనలు, సీఈసీ వాదనలు, న్యాయస్థానంలో పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో ఉప ఎన్నిక జరగడం కష్టమేననే అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల పిటిషన్ పై తుది తీర్పు వచ్చే వరకు న్యాయస్థానాలు కూడా చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే ముందుకెళ్తుండటంతో, ఇక్కడ ఉప ఎన్నిక తక్షణమే జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించిన అంశాలు, న్యాయస్థానం తదుపరి విచారణలో తీసుకోబోయే నిర్ణయాలు ఈ నియోజకవర్గ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. ఏది ఏమైనప్పటికీ, చట్టపరమైన చిక్కుల ఉచ్చు వీడే వరకు ఖైరతాబాద్ ఓటర్లకు, రాజకీయ నాయకులకు ఎన్నికల వేడి తగిలే సూచనలు మాత్రం ప్రస్తుతానికి లేవు.








