కేటీఆర్ స్టార్ హోటల్స్ ఇవే..!!
కేటీఆర్ కు హైదరాబాద్ లో మూడు హోటల్స్ ఉన్నాయంటూ సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ కేటీఆర్ కు హోటల్స్ బిజినెస్ ఉందనే సంగతే చాలా మందికి తెలీదు. దీనిపై స్పందించిన కేటీఆర్, అవును నాకు హోటల్స్ ఉన్నాయి. 2006లో ఒక హోటల్ ప్రారంభించా.. అవి ఇప్పుడు మూడయ్యాయి.. అయితే తప్పేంటి.. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో కూడా పేర్కొన్నా.. అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అసలు కేటీఆర్ హోటల్స్ ఏవి.. ఎక్కడున్నాయి.. అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. కేటీఆర్ హోటల్స్ పై అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ భార్య శైలిమ డైరెక్టర్ గా ఉన్న హోటల్ గ్రూప్ వెలుగులోకి వచ్చింది. ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో శైలిమ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమెతో పాటు శ్రీధర్ తేలుకుంట్ల, చిలుకూరి పట్టాభి రామారావు కూడా అందులో డైరెక్టర్లు. అంతకుముందు 2005 అక్టోబర్ 25 నుంచి 2014 అక్టోబర్ వరకూ కేటీఆర్ కూడా ఇందులో డైరెక్టర్ గా ఉన్నారు. జోగినపల్లి సంతోష్ రావు కూడా గతంలో డైరెక్టర్ గా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఫ్యామిలీ నుంచి ఆయన భార్య శైలిమ డైరెక్టర్ గా ఉన్నారు.
ఎట్ హోం హాస్పిటాలిటి సర్వీసెస్ ఆధ్వర్యంలో మూడు హోటల్స్ ఉన్నాయి. ఇందులో ఎట్ హోం అపార్ట్ మెంట్ హోటల్ ఒకటి. ఇదొక సర్వీస్ అపార్ట్ మెంట్. ప్రీమియం సర్వీసెస్ అందిస్తోంది. ఇది హైటెక్ సిటీలో ఉంది. ఇక రెండోది డెక్కన్ సెరాయ్ హోటల్. ఇది కూడా హైటెక్ సిటీలోనే ఉంది. ఇది 3 స్టార్ హోటల్. ఇందులో కూడా ప్రీమియం సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. దాదాపు వంద రూములతో ఇది ఏర్పాటైంది. ఇక మూడోది డెక్కన్ సెరాయ్ గ్రాండే. ఇది గచ్చిబౌలిలో ఉంది. ఇది 4 స్టార్ హోటల్. ప్రీమియం లొకేషన్ లో ఉంది. ఇందులో అల్ట్రా ప్రీమియం సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి.
దీంతో కేటీఆర్ హోటల్స్ పై క్లారిటీ వచ్చింది. ఆయన కూడా తనకు మూడు హోటల్స్ ఉన్నట్టు అంగీకరించారు. అవేవో ఇప్పుడు దాదాపు అందరికీ తెలిసిపోయింది. అయితే ఇన్నాళ్లూ హైదరాబాద్ లో కుటుంబం అంతా కలిసి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదని., అందుకే కేసీఆర్ ఫాంహౌస్ లో ఉంటున్నారని, తానొక అద్దె ఇంట్లో ఉంటున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో స్టార్ హోటల్స్ ఉన్నట్టు బయటపడడంతో ఇల్లు లేకపోయినా స్టార్ హోటల్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.








