తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త
దసరా (Dasara) సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల (Government employees)కు, పెన్షనర్లకు (pensioners) రెండు డిఏలు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. సచివాలయంలో సిఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి సంబంధించిన అంశాలను మంత్రి పొంగులేటి సహచర మంత్రులతో కలిసి విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ 2024 నుంచి బకాయి ఉన్న డిఏల్లో రెండు డిఏలను వెంటనే మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రెండు డిఏల వల్ల ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,500 కోట్ల భారం పడనుందన్నారు.
రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజుకు 15,000ల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా ఈ సీజన్లో అది రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు చేరిందని దాదాపుగా 20 వేల మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో దాదాపు 17 శాతం వర్షపాతం లోటు ఉందని, నిన్నటితో రుతుపవనాల కాలం కూడా ముగిసిందని తెలిపారు.
రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ లో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా మంత్రి పేర్కొన్నారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 5,800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ డిజిటల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తొలిదశలో కోహెడ ఫ్రూట్ మార్కెట్‌కు రూ.650 కోట్లు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.








