SpaceXలో ఉద్యోగం రావాలంటే అర్హతలేమిటి?… డిగ్రీ కంటే ఇవే ముఖ్యం!
స్పేస్ఎక్స్ (SpaceX) అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అంతరిక్ష ప్రయోగాలు, అంగారకుడిపైకి మనుషులను తీసుకెళ్లే మస్క్ పెద్ద పెద్ద కలలు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్పేస్ ఎక్స్ గురించే మాట్లాడుతున్నారు.స్పేస్ఎక్స్ ప్రస్తుతం 11,000కు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడమే వీటి ప్రధాన ఉద్దేశం.
అదే సమయంలో భారీ స్టార్‌షిప్ రాకెట్ ద్వారా చంద్రుడిపై మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత మార్స్ వైపు వెళ్లడం కంపెనీ లక్ష్యాల్లో ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం డేటా సెంటర్లుగా పనిచేసే ఉపగ్రహాలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది.
అయితే అంతటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఉద్యోగం సాధించడం ఎలా? అక్కడ పనిచేసే వాళ్ల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది? అసలు వాళ్లు ఎలాంటి వాళ్లను తీసుకుంటారు? మస్క్ సామ్రాజ్యంలో అడుగుపెట్టాలంటే ఏం కావాలో చూద్దాం.
ప్రస్తుతం స్పేస్ఎక్స్లో సుమారు 22,000 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు దాదాపు 2,500 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయితే ఆ ఉద్యోగానికి ఎంపిక కావాలంటే కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. అధిక మేధస్సు, ప్రాక్టికల్ అనుభవం, ఎక్కువ గంటలు పనిచేసే సిద్ధత కూడా అవసరం.
డిగ్రీ ముఖ్యం కాదు.. మీరు ఏం చేశారనేదే మేటర్!
స్పేస్ఎక్స్లో ఉద్యోగం రావాలంటే ఏదో పెద్ద పెద్ద కాలేజీల డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ ముఖ్యంగా చూసేది మీకున్న ప్రాక్టికల్ అనుభవం, మీ తెలివితేటలు మాత్రమే. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్వెల్ చెప్పినట్లు, కంపెనీకి పుట్టుకతోనే సహజమైన తెలివితేటలు ఉన్నవాళ్లు కావాలి. అంటే ఒక రంగంలో మీకు ముందే పూర్తి అనుభవం లేకపోయినా, కొత్త విషయాన్ని ఎంత వేగంగా నేర్చుకోగలరు అనేది ఇక్కడ ముఖ్యం. ఇంటర్వ్యూలలో కూడా మీరు చదివిన చదువుల కంటే, గతాంలో మీరొచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించారు, ఏ ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేశారనే విషయాలపైనే లోతుగా ప్రశ్నిస్తారు.
వారానికి 60 గంటల పని.. వీకెండ్లు కూడా బాక్సాఫీసే!
స్పేస్ఎక్స్లో లైఫ్ అంటే అంత తేలిక కాదు. అక్కడ వారానికి కనీసం 60 గంటలు పనిచేయాల్సి రావచ్చు, కొన్నిసార్లు వీకెండ్స్‌లో కూడా ఆఫీస్‌కే పరిమితమవ్వాల్సి వస్తుంది. “ప్రపంచాన్ని మార్చే గొప్ప పనులు వారానికి 40 గంటలు పనిచేస్తే కావు” అనేది మస్క్ నమ్మే సిద్ధాంతం. అందుకే అక్కడ పని వాతావరణం చాలా తీవ్రంగా, ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఎలాన్ మస్క్ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్‌లోకి వచ్చి రివ్యూ పెడతారో, ఎప్పుడు డెడ్లైన్లు పెంచి పని చేయిస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఈ మితిమీరిన ఒత్తిడి తట్టుకోలేక కొన్నేళ్ల తర్వాత చాలామంది ఉద్యోగులు కాస్త ప్రశాంతంగా ఉండే వేరే కంపెనీల్లోకి మారిపోతుంటారు.
ఇంజినీర్లే కాదు.. బరిస్టాలు, వెల్డర్లకు కూడా చోటు!
అంతరిక్ష సంస్థ అనగానే కేవలం ఏరోస్పేస్, సాఫ్ట్వేర్ ఇంజినీర్లే ఉంటారని అనుకుంటే పొరపాటే. అక్కడ వెల్డర్లు, టెక్నీషియన్లు, స్పేస్‌సూట్ డిజైనర్లు, చివరికి బరిస్టాలు కూడా పనిచేస్తుంటారు. జీతాల విషయానికి వస్తే, ఇంజినీరింగ్ ఉద్యోగులకు మార్కెట్ సగటు కంటే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలపర్లకు మాత్రం ఇతర స్పేస్ కంపెనీల కంటే చాలా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారు. దీనికి తోడు కంపెనీ ఇచ్చే షేర్లు (RSUs) ఉద్యోగులకు అదనపు ఆకర్షణ. స్పేస్ఎక్స్ మార్కెట్ విలువ పెరుగుతున్న కొద్దీ, కాగితంపై ఆ షేర్ల విలువ చూసుకుని ఉద్యోగులు కోటీశ్వరులవుతున్నారు.
మస్క్ ‘అల్గారిథమ్’.. అడిగి తెలుసుకో, అవసరం లేకపోతే తీసేయ్!
ఇక్కడ పనిచేసే ప్రతి ఇంజినీర్ మస్క్ చెప్పే ఒక “అల్గారిథమ్” పద్ధతిని పాటించాలి. ఏదైనా ఒక ప్రక్రియ ఆఫీస్‌లో ఉందంటే.. “ఇది ఎప్పటి నుంచో ఇలాగే ఉంది” అని చెప్పడానికి వీల్లేదు. అసలు ఈ ప్రాసెస్ ఎందుకు ఉంది? దీన్ని ఎవరు పెట్టారు? అని ముందుగా ప్రశ్నించాలి. అందులో అనవసరమైన దశలేవైనా ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. అయితే, ఈ పద్ధతి వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా వచ్చాయి. రాకెట్ హార్డ్‌వేర్‌లో కొన్ని వైర్లు, ట్యూబులు దండగ అని మస్క్ తీయించేసిన తర్వాత, తీరా చూస్తే అవే అసలైన భాగాలని తేలిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కంపెనీ కల్చర్.. మస్క్‌ను దాటి ఏదీ లేదు!
స్పేస్ఎక్స్లో ఉద్యోగం చేయడం అంటే మస్క్ వ్యక్తిత్వాన్ని, ఆయన కల్చర్‌ను పూర్తిగా అంగీకరించడమే. “SpaceX అంటే Elon, Elon అంటేనే SpaceX” అని కంపెనీలోని ఉన్నతాధికారులే అంటుంటారు. అయితే, ఈ తీవ్రమైన పని సంస్కృతిపై కొన్ని విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడ మాట్లాడే స్వేచ్ఛ తక్కువని, మస్క్ నిర్ణయాలను లేదా ఆయన వ్యాఖ్యలను బహిరంగంగా విమర్శిస్తే ఉద్యోగంలోంచి తీసేస్తారనే భయం ఉద్యోగుల్లో ఉందనే వార్తలు వచ్చాయి. లైంగిక వేధింపులు, వర్క్‌ప్లేస్ వాతావరణంపై గతంలో కొందరు మాజీ ఉద్యోగులు కోర్టు కేసులు కూడా వేశారు.
మరి భారతీయులకు…
భారతీయులు అయితే స్పేస్ఎక్స్ వైపు అడుగులు వేసేముందు, ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక కఠినమైన నిజం ఉంది. అదేంటంటే, అక్కడ ఉద్యోగం రావడానికి మొదటి ఛాలెంజ్ డిగ్రీ లేదా నైపుణ్యం కాదు… అమెరికా పౌరసత్వం (US Citizenship) లేదా లాఫుల్ పర్మనెంట్ రెసిడెన్సీ (Green Card). అమెరికా ఎగుమతి నియంత్రణ చట్టాల (ITAR) వల్ల రాకెట్లు, శాటిలైట్లకు సంబంధించిన సాంకేతికతపై పనిచేసే ఉద్యోగాలకు ఈ అర్హత తప్పనిసరి.
భారత్‌లో ఉండి నేరుగా అప్లై చేయాలనుకుంటే ఈ నియమం పెద్ద ప్రతిబంధకంగా మారుతుంది. అయితే అంతటితో ఆశలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పేస్ఎక్స్ ఆశించే సాంకేతిక సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని మనం ఇక్కడ నుంచే పెంపొందించుకోవచ్చు!
మొత్తానికి…
స్పేస్ఎక్స్లో ఉద్యోగం అంటే కేవలం ఒక కంపెనీలో జాబ్ చేయడం కాదు.. భూమి సరిహద్దులు దాటి మనుషులను తీసుకెళ్లాలనే ఒక పెద్ద లక్ష్యంలో భాగమవ్వడం. ఆ లక్ష్యం కోసం తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని, ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నవాళ్లకు స్పేస్ఎక్స్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








