దానంకు సీటు లేనట్టేనా? తెరపైకి మహిళా నేత!?
తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టీ ఖైరతాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో, ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలూ ఈ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఏ క్షణమైనా ఈ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తనకే సీటు కేటాయిస్తుందని, తాను మళ్లీ విజయం సాధిస్తానని దానం నాగేందర్ ధీమాతో ఉన్నారు. అయితే పార్టీ హైకమాండ్ ఆలోచన మరోలా ఉన్నట్టు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్, ఆ వెంటనే కాంగ్రెస్ గూటికి చేరడం, ఆపై సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడం, తాజాగా కోర్టు తీర్పుతో తన సభ్యత్వాన్ని కోల్పోవడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయననే బరిలోకి దించితే ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు దీనిని ప్రధాన అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. అవకాశవాద రాజకీయం అని విపక్షాలు సంధించే విమర్శలు సామాన్య ఓటర్లపై ప్రభావం చూపించవచ్చు. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
కానీ ఖైరతాబాద్ ఉపఎన్నికలో పార్టీ గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక్కడ గెలవడం ద్వారా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే భావనను కలిగించవచ్చు. ఓడితే కాంగ్రెస్ పార్టీ పతనానికి అడుగులు పడినట్లే. అందుకే.. ఇక్కడ ప్లాన్-బి ని అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి కుమార్తె, జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా సేవలందించిన పి. విజయారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ బస్తీలు, దిగువ మధ్యతరగతి వర్గాల్లో ఇప్పటీకీ పీజేఆర్ పేరుకు బలమైన సెంటిమెంట్, ప్రజాదరణ ఉంది. విజయారెడ్డికి ఉన్న వివాదరహిత ఇమేజ్, కుటుంబ నేపథ్యం, సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఏకతాటిపైకి తెస్తే ఫలితం తమకు అనుకూలంగా మారుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది.
అయితే ఈ ప్లాన్ అమలు చేయడం అంత సులువు కాదు. దానం నాగేందర్ దశాబ్దాలుగా ఖైరతాబాద్‌ను తన రాజకీయ కంచుకోటగా మలచుకున్నారు. అలాంటి చోట తనను కాదని, ఇతరులకు సీటు కేటాయిస్తే ఆయన మౌనంగా ఉంటారా అనేది ప్రశ్నార్థకమే. ఆయన అసంతృప్తిని చల్లారేందుకు హైకమాండ్ ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని ఆఫర్ చేస్తుందనే చర్చ జరుగుతోంది. అయినా.., క్షేత్రస్థాయిలో దానం నాగేందర్ అనుచర వర్గం విజయారెడ్డి విజయానికి ఎంతవరకు సహకరిస్తుందనేది రేవంత్ రెడ్డి నాయకత్వానికి అసలు సిసలు పరీక్షగా మారనుంది.
మొత్తానికి, ఖైరతాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. దానం నాగేందర్ నే బరిలోకి దింపితే ఫలితం తేడా కొట్టే ప్రమాదం ఉందనే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇతరులను బరిలోకి దింపితే దానం నాగేందర్ ను బుజ్జగించడం, ఆయన సహకారం.. ఎంతవరకు వర్కవుట్ అవుతాయనేది అంతు చిక్కట్లేదు. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో!








