ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు!
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటరు నమోదు ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా పార్టీలు భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్ధులను ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో నెగ్గడం ద్వారా కేడర్ లో ఉత్సాహం నింపాలని ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణీదేవి ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శిబిరంలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పార్టీ హైకమాండ్ పడింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని, అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి ‘బీసీ’ అభ్యర్థిని బరిలో దింపాలని గులాబీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతను హన్మకొండకు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు అనుగుల రాకేష్ రెడ్డికి అప్పగించింది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో గ్రౌండ్‌వర్క్ ప్రారంభించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి అయిన రాకేష్ రెడ్డి, గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆయన గట్టిగా ఫైట్ చేస్తున్నారు.
మరోవైపు.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం కోసం బీసీ అభ్యర్థిని పరిశీలిస్తోంది. కాసాని వీరేశ్ ముదిరాజ్, జి. నాగేందర్ గౌడ్, రవీందర్ యాదవ్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో వివిధ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వీరేశ్ ముదిరాజ్ ప్రస్తుతం ఈ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్టభద్రుల నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేశారు. వికారాబాద్ కు చెందిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ జి. నాగేందర్ గౌడ్ పేరును కూడా పార్టీ పరిశీలిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ దూకుడుకు ఎలాగైనా చెక్ పెట్టాలని బీఆర్ఎస్ చూస్తోంది. అందుకే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ కేడర్ లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఓడిపోతే కేడర్ నిరాశ పడుతుంది. కేడర్ ను కాపాడుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. అందుకే గెలుపు గుర్రాలను బరిలోకి దించడం ద్వారా సత్తా చాటాలనుకుంటోంది బీఆర్ఎస్.








