ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ అటెన్షన్..!
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా బీజేపీ తన పరిధిని మరింత విస్తరించేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్.., వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాలకు జరగనున్న ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓటరు నమోదు ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో, కాషాయ పార్టీ బూత్ స్థాయి నుంచి కార్యాచరణను వేగవంతం చేసింది.
రాష్ట్రంలో మొత్తం 10 ఉమ్మడి జిల్లాల పరిధిలోని దాదాపు 76 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు స్థానాలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. జనసంఘ్ రోజుల నుంచే ఈ పట్టభద్రుల నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన పునాదులు, క్షేత్రస్థాయి పట్టు ఉందని ఆయన గుర్తుచేశారు. 2015 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లోనూ పార్టీ చూపిన తెగువను, సాధించిన ఫలితాలను ఈ సందర్భంగా నేతలు బేరీజు వేసుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఈ ఎన్నికలను భవిష్యత్తు పోరాటాలకు ఒక సెమీఫైనల్స్ లా భావిస్తున్న బీజేపీ, ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పావులు కదుపుతోంది.
ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ లను ఒకేసారి టార్గెట్ చేస్తూ బీజేపీ తన రాజకీయ ఎజెండాను అమలు చేస్తోంది. ఉద్యోగ నియామకాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో యువత ఆశలను పూర్తిగా వమ్ము చేసిందని రామచందర్ రావు తీవ్రంగా ఆరోపించారు. మరోవైపు.. కాంగ్రెస్ పాలనలో డిఏ, పీఆర్సీ బకాయిలు, పెన్షన్ల సమస్యలు పెండింగ్లో పడటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని ఆయన విశ్లేషించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందంటూ నిరుద్యోగులు, పట్టభద్రుల నుంచి వస్తున్న ప్రశ్నలను బీజేపీ తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా విద్యావంతులు గళం విప్పాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
ఎన్నికల వ్యూహంలో భాగంగా బీజేపీ ఇప్పటికే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని స్థాయిల్లోనూ కార్యాచరణను ప్రారంభించింది. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడమే లక్ష్యంగా కిందిస్థాయి క్యాడర్ను అప్రమత్తం చేశారు. పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ, క్యాడర్ అంతా ఐక్యంగా నిలబడి గెలుపు కోసం శ్రమించాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని సంకేతాలు పంపారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టభద్రుల చైతన్యంతో తమ రాజకీయ సత్తా చాటాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.








