బిల్డింగ్‌లో దారి తప్పితే ఇక మనుషులను అడగాల్సిన పనిలేదా? ఇదిగో కొత్త టెక్నాలజీ!
మన ఫోన్ ఓపెన్ చేసి జీపీఎస్ ఆన్ చేయగానే ఏం జరుగుతుంది? మనం ప్రపంచంలో ఎక్కడున్నామో క్షణాల్లో తెలిసిపోతుంది. ఏ దారిలో వెళ్తే ట్రాఫిక్ తక్కువగా ఉందో కూడా గూగుల్ మ్యాప్స్ చాలా సులభంగా చెప్పేస్తుంది. కానీ, అదే ఫోన్ పట్టుకుని ఒక పెద్ద మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లోకో, లేదా మైలు పొడవుండే భారీ ఎయిర్పోర్టులోకో వెళ్తే కథ మారిపోతుంది. “నాల్గో అంతస్తులో 407 రూమ్ ఎక్కడుంది?”, “బోర్డింగ్ గేట్ వైపు వెళ్లడానికి ఏ లిఫ్ట్ ఎక్కాలి?” అని అడిగితే బయట అద్భుతంగా పనిచేసే జీపీఎస్ భవనం లోపల పూర్తిగా చేతులెత్తేస్తుంది.
దానికి కారణం మన చుట్టూ ఉండే మందపాటి కాంక్రీట్ గోడలు, భవన నిర్మాణాలే. ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నళ్లను ఈ గోడలు అడ్డుకోవడంతో జీపీఎస్ తన ఖచ్చితత్వాన్ని కోల్పోతుంది. ప్రపంచాన్నంతటినీ మ్యాప్ చేసిన ఆధునిక సాంకేతికతకు, మన చుట్టూ ఉన్న నాలుగు గోడల మధ్య దారి చూపించడం ఇప్పటివరకు ఒక పెద్ద ఛాలెంజ్ గానే మిగిలిపోయింది. అయితే ప్రతీ సమస్యను ..సమస్యగా చూడకుండా ఓ కొత్త ఆవిష్కరణకు సరపడే ఆలోచించే వాళ్లు ఉండటం వల్లే మనం హ్యాపీగా బ్రతుకుతున్నాం. అలాంటి ఓ కొత్త ఆవిష్కరణ మన ముందుకు వస్తోంది. అదేంటో చూద్దాం.
ఇండోర్ నావిగేషన్: గోడల మధ్య కొత్త దిక్సూచి
రోడ్డు మీద ఆగిపోయిన మ్యాపింగ్‌ను భవనం లోపలి కారిడార్లలోకి, గదుల మధ్యకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘ఇండోర్ నావిగేషన్’ (Indoor Navigation) టెక్నాలజీ రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ‘ఇండోర్స్ నావిగేషన్’ అనే సంస్థ ‘ఇండోర్స్ నావిగేషన్ ప్లాట్‌ఫామ్ (INP)’ పేరుతో ఒక డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. సింపుల్ గా చెప్పాలంటే, ఒక భవనానికి సంబంధించి ఖచ్చితమైన డిజిటల్ మోడల్‌ను తయారుచేసి, అందులో కదులుతున్న మనుషులను, రవాణా అవుతున్న పరికరాలను రియల్ టైమ్‌లో అనుసంధానించడమే ఈ ప్లాట్‌ఫామ్ పని. ఒక అంతస్తు నుంచి భవనం మొత్తానికి కస్టమ్ మ్యాప్‌లు తయారు చేసి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్లాలో, ఏ కారిడార్ తీసుకోవాలో ఈ టెక్నాలజీ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు.
ఆస్పత్రుల నుంచి విమానాశ్రయాల వరకు సాయం
ఈ ఇండోర్ నావిగేషన్ వల్ల నిజ జీవితంలో ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. ఉదాహరణకు ఒక పెద్ద హాస్పిటల్లో అత్యవసరంగా ICU ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడే కుటుంబ సభ్యులకు, ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ గేట్ వెతుక్కుంటూ విమానం మిస్సయ్యే ప్రయాణికులకు ఈ టెక్నాలజీ ఒక వరంగా మారుతుంది. విశ్వవిద్యాలయాల్లో కొత్తగా చేరిన విద్యార్థులు తమ క్లాస్‌రూమ్‌లను, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారులు తమకు కావలసిన నిర్దిష్టమైన షాప్‌ను సులభంగా కనుగొనవచ్చు. ఇది కేవలం మనుషులకు దారి చూపించడానికే కాకుండా.. ఉద్యోగుల కదలికలు, వస్తువుల ట్రాకింగ్, గదుల బుకింగ్, విజిటర్ అనలిటిక్స్ వంటి అనేక సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తుంది.
బ్లూటూత్ నుంచి UWB వరకు.. ఎలా పనిచేస్తుంది?
భవనం లోపల జీపీఎస్ సిగ్నల్స్ సరిగ్గా పని చేయవు కాబట్టి, ఈ ప్లాట్‌ఫామ్ ఇతర రకాల సాంకేతికతలపై ఆధారపడుతుంది. బ్లూటూత్, వై-ఫై, UWB (Ultra-Wideband), RFID, LoRa వంటి మల్టిపుల్ సిగ్నల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని లొకేషన్‌ను గుర్తిస్తుంది. Wi-Fi RTT వంటి అధునాతన సాంకేతికతలను వాడినప్పుడు, ఇది కేవలం 30 సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో లోపల ఉన్న వస్తువులను లేదా వ్యక్తులను చూపించగలదు. దీనివల్ల ఒక భారీ వేర్‌హౌస్‌లో ఏ మూలన ఏ పరికరం ఉందో సులభంగా ట్రాక్ చేయడమే కాకుండా, భవనం మొత్తాన్ని డిజిటల్‌గా అర్థం చేసుకునే వెసులుబాటు యాజమాన్యాలకు లభిస్తుంది.
సులభమైన అనుసంధానం, భద్రతకు పెద్దపీట
ఇంతటి సంక్లిష్టమైన సాంకేతికతను అమలు చేయడం సంస్థలకు చాలా సులభమని కంపెనీ చెబుతోంది. తమ SDK, APIల ద్వారా కేవలం రెండు వారాల్లోనే ఈ సిస్టమ్‌ను ఏ భవనంలోనైనా ఇంటిగ్రేట్ చేయవచ్చు. అలాగే, సమాచార భద్రత విషయంలోనూ రెండు రకాల మోడళ్లను ఇస్తున్నారు. సాధారణ అవసరాల కోసం క్లౌడ్/SaaS మోడల్ వాడవచ్చు. అయితే ఆస్పత్రులు, ప్రభుత్వ రక్షణ సంస్థలు, బడా కార్పొరేట్లు తమ సున్నితమైన డేటాను బయటకు పంపకుండా, తమ సొంత సర్వర్లలోనే (On-Premises) ఈ నెట్‌వర్క్‌ను నడుపుకోవచ్చు.
దుబాయ్ డిజిటల్ ట్విన్ – భవిష్యత్తు వైపు ముందడుగు
ప్రపంచవ్యాప్తంగా నగరాలు డిజిటల్‌గా మారుతున్న క్రమంలో ఇండోర్ నావిగేషన్ పాత్ర మరింత కీలకంగా మారింది. 2026 జూలైలో దుబాయ్ ప్రభుత్వం ‘దుబాయ్ డిజిటల్ ట్విన్’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి, నగరంలోని దాదాపు 1,95,000 భవనాలను 3D మోడళ్లుగా మార్చింది. నగరంలో రోడ్లు, భవనాల డిజిటలైజేషన్ ఒకెత్తయితే.. ఆ భవనాల లోపల మనుషులు, వస్తువుల కదలికలను మ్యాప్ చేయడం మరొక ఎత్తు. ఈ ఇండోర్ నావిగేషన్ ఆ లోటును భర్తీ చేస్తుంది. అయితే, భవనం లోపల మన ప్రతి కదలికను సాంకేతికత గమనిస్తున్నప్పుడు డేటా ప్రైవసీ, భద్రతకు సంబంధించిన ప్రశ్నలు రావడం సహజం. సేకరించిన డేటాను ఎవరు చూస్తారు, ఎంతకాలం నిల్వ చేస్తారనేది ప్రాజెక్ట్ అమలు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది.
రష్యా నుంచి ప్రపంచ మార్కెట్లలోకి..
‘మేడ్ ఇన్ రష్యా’ సర్టిఫికేషన్ పొందిన ఈ ఇండోర్ నావిగేషన్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే జార్జియాలో తన ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తోంది. దుబాయ్‌లో జరిగే ప్రసిద్ధ జిటెక్స్ గ్లోబల్ (GITEX Global) ఎక్స్‌పోలో పాల్గొనడంతో పాటు, జకార్తా విమానాశ్రయం, ఈక్వెడార్‌లోని షాపింగ్ మాల్స్‌లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.భారత్ లోనూ మొదట ముంబైలో ఎంట్రి ఇచ్చి అక్కడ నుంచి అన్ని నగరాలకు విస్తరించనుంది. ఈలోగా మనవాళ్లు ఈ ఐడియాకు తగిన ఐడియాతో మరో ప్లాట్ ఫామ్ ప్రారంభించినా ఆశ్చర్యంపోనక్కర్లేదు.
భవనాల రూపురేఖలను మార్చే సాంకేతిక విప్లవం
ఒకప్పుడు మ్యాపింగ్ అంటే కేవలం రోడ్లు, వీధులు మాత్రమే. ఆ తర్వాత నగరాలు, భవనాలు, ల్యాండ్‌మార్కులు అందులో చేరాయి. ఇప్పుడు భవనం లోపల ఉండే గదులు, లిఫ్ట్‌లు, కారిడార్లు కూడా మ్యాప్‌లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు మనం భవనాన్ని గోడలు, గదులు ఉన్న ఒక నిర్మాలంగా మాత్రమే చూశాం. కానీ భవిష్యత్తులో ప్రతీ భవనం ఒక డిజిటల్ వ్యవస్థగా మారి, తన లోపలి కదలికలను తనే అర్థం చేసుకోగలదు. జీపీఎస్ బయట ప్రపంచాన్ని మ్యాప్ చేస్తే, ఇండోర్ నావిగేషన్ గోడల మధ్య ఉన్న ప్రపంచాన్ని మ్యాప్ చేస్తోంది. నిన్నటివరకు భవనాల్లో మనం దారి వెతికాం.. రేపు భవనాలే మనకు దారి చూపిస్తాయి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








