ఏపీ విద్యా వ్యవస్థకు సహకారం అందిస్తాం : సింగపూర్ హోం మంత్రి షణ్ముగం
ఏపీ విద్యా వ్యవస్థలో సంస్కరణలు భేష్
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ప్రశంసించిన సింగపూర్ హోం మంత్రి షణ్ముగం
ఏపీ విద్యా వ్యవస్థ బలోపేతానికి సింగపూర్ సహకరిస్తుందని హామీ
మాదకద్రవ్యాల నివారణ, విద్యావ్యవస్థ బలోపేతం వంటి కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ దేశాల నడుమ సమగ్ర ఆలోచనల మార్పిడి జరిగింది.
మంగళవారం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, సింగపూర్ హోం, చట్టసభల మంత్రి కే.షణ్ముగంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఉభయ నేతలు రాష్ట్ర అభివృద్ధి, విద్యా సంస్కరణలు, సామాజిక భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, విద్యాశాఖలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులను మంత్రి లోకేష్, సింగపూర్ హోంమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను షణ్ముగం అభినందించారు. సింగపూర్ అవలంభిస్తున్న అత్యుత్తమ విధానాలను ఏపీలో అమలుకు సహకరిస్తామని షణ్ముగం హామీ ఇచ్చారు.








