వివేకా హత్య కేసులో కీలక దశకు ఈడీ విచారణ..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు తీవ్రతను మరింత పెంచింది. ఈ కేసులో జరిగినట్లుగా భావిస్తున్న వందల కోట్ల ఆర్థిక లావాదేవీలు మరియు మనీ లాండరింగ్ కోణంలో అధికారులు రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కేసులో అత్యంత కీలక నిందితులుగా ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్ రెడ్డిలను ఈడీ అధికారులు ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.
వివేకా హత్య జరగడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు, అంటే 2019 మార్చి 15న ఎర్ర గంగిరెడ్డి నివాసంలో జరిగిన ఆ సీక్రెట్ సమావేశం వివరాలపై ఈడీ అధికారులు ప్రధానంగా ఆరా తీశారు. ఆ రోజు రాత్రి ఎవరెవరు కలిశారు? ఎవరి నుంచి ఎవరికి ఎంత నగదు చేతులు మారింది? అనే కీలక అంశాలపై ఎర్ర గంగిరెడ్డిని గట్టిగా ప్రశ్నించారు. మరోవైపు, వివేకా హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలం నుండి గోడ దూకి పారిపోయిన సీసీటీవీ (CCTV) ఫుటేజీ ఆధారంగా A3 ఉమాశంకర్ రెడ్డిని అధికారులు నిలదీశారు.
ఆ దృశ్యాలలో ఉన్నది నువ్వేనా? నీ వెనుక ఉన్నది ఎవరు? అంటూ దర్యాప్తు అధికారులు ఆధారాలను ముందుంచి విచారించారు. ఈ రెండో రోజు విచారణలో ఈడీ అధికారులకు.. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరియు రెండో నిందితుడు సునీల్ యాదవ్ గతంలో ఇచ్చిన సంచలన వాంగ్మూలాలే ప్రధాన అస్త్రాలుగా మారాయి. వారు చెప్పిన వివరాల ప్రకారం.. హత్య చేయడానికి ముందు ఎవరి ద్వారా సుపారీ సొమ్ము అందింది..? లబ్ధి పొందిన పెద్దల హస్తం ఇందులో ఎంతవరకు ఉంది..? అనే కోణంలో నిందితుల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. నిందితుడు సునీల్ యాదవ్ ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో, ఈడీ అధికారులు నిందితుల నుంచి సేకరిస్తున్న ఈ కీలక సమాచారం వైఎస్సార్ కడప జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.








