పల్లె ప్రగతికి కూటమి ఉక్కు సంకల్పం: పవన్ కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామాలను ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగు వేసింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఏకంగా రూ.11,085 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన వివిధ శంకుస్థాపన పనుల శిలాఫలకాన్ని ఈ వేదికపై నుంచి ఇరు నేతలు ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు.
ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ నేతలతో కలిసి ర్యాంప్‌పై నడుస్తూ వస్తుండగా.. సభికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, పంచాయతీలకు కనీస నిధులు కూడా ఇవ్వకుండా సర్పంచుల అధికారాలను లాగేసుకున్నారని ఆయన మండిపడ్డారు.
వైసీపీ నిర్వాకం వల్ల పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు, కనీస మౌలిక వసతులు లేక ప్రజలు నరకం చూశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి సహాయ సహకారాలతో తాము పంచాయతీరాజ్ శాఖను ఇప్పుడిప్పుడే బలోపేతం చేస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ ‘పల్లె పండుగ 3.0’ మరియు కేంద్ర ప్రభుత్వ ‘జల్ జీవన్ మిషన్’ పథకాల సమన్వయంతో రాబోయే రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలోని ప్రతి పల్లెటూరి రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి గ్రామానికి సిమెంట్ రహదారుల నిర్మాణమే తమ కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.








