ధర్మన్ లో రాపో.. లీక్ చేసిన రాశీ
రాశీ ఖన్నా షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు సూపర్‌స్టార్ రజినీకాంత్ ధర్మన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మైసూర్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమె రజినీకాంత్, రామ్ పోతినేని కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్‌కు ఆమె పెట్టిన క్యాప్షన్‌లో ఇద్దరితో కలిసి ఉదయం వర్కౌట్స్ చేసినట్లు పేర్కొనడం విశేషం.
ఇప్పటివరకు ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని భాగమవుతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. రామ్ క్యారెక్టర్ ఏంటి? కథలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అనే విషయాలు కూడా సీక్రెట్ గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాశి ఖన్నా చేసిన పోస్ట్ సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని అనుకోకుండా బయటపెట్టిందనే డిస్కషన్ మొదలైంది.
అయితే పోస్ట్ వైరల్ అవుతున్న సమయంలోనే రాశీ ఖన్నా దానిని డిలీట్ చేయడంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. రామ్ పోతినేని నిజంగానే ధర్మన్ లో నటిస్తున్నారా అనే ప్రశ్నకు ఈ పరిణామం బలం చేకూర్చింది. మరోవైపు రజినీకాంత్ ప్రధాన పాత్రలో అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన పాత్రల వివరాలను మేకర్స్ ఇంకా అఫీషియల్ గా వెల్లడించలేదు.








