పోలీసులు కాదు… మాఫియానే డ్రగ్స్ ను అడ్డుకుంటోందా? ఇటలీ క్రైమ్ వరల్డ్‌లో షాకింగ్ ట్విస్ట్!
రోమ్‌లోని మాఫియా సామ్రాజ్యంకి చెందిన ఒక చీకటి గోదాంలో ఓ రోజు…
కోట్ల విలువైన కొకైన్, హెరాయిన్ ప్యాకెట్లు, నోట్ల కట్టల మధ్య ఒక కొత్త డ్రగ్ డీలర్ ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఉన్న ఓ బుల్లి ప్యాకెట్‌ను చూపిస్తూ, “ఇది ఫెంటనిల్” అని చెప్పాడు. అక్కడే ఉన్న ఇటాలియన్ మాఫియా బాస్ దాన్ని పరిశీలనగా చూశాడు. పరిమాణంలో చాలా చిన్నదే అయినా, దాని పవర్ మాత్రం ఊహించలేనంత భయంకరం! మనం వాడే సాధారణ మార్ఫిన్ కంటే ఏకంగా 100 రెట్లు ఎక్కువ కిక్కు ఇచ్చే డ్రగ్ అది.
“ఇది అమ్మితే ఎంతలొస్తుంది?” అని బాస్ అడగ్గానే, డీలర్ కళ్లు తేలేసే ఒక భారీ ఫిగర్ చెప్పాడు. బాస్ కాసేపు సైలెంట్‌గా ఆలోచించి, ఆ ప్యాకెట్‌ను అవతలికి తోసేస్తూ “ఈ చెత్త మనకొద్దు!” అని తేల్చి చెప్పేశాడు.ఎందుకనేది కొత్త డ్రగ్ డీలర్ కు అర్దం కాలేదు.
పోలీసులంటే భయం తోనో, లేదా జనాలు చచ్చిపోతారనే జాలి తోనో ఆ మాఫియా డాన్ ఆ నిర్ణయం తీసుకోలేదు. కేవలం తన పక్కా ‘బిజినెస్ మైండ్’తోనే ఆ పనిచేశాడు! ఇది నిజంగానే ఇటలీ మాఫియా చరిత్రలోనే అత్యంత విచిత్రమైన అధ్యాయం. కొకైన్, హెరాయిన్ అమ్మకాలతో వేల కోట్లు కొల్లగొట్టే క్రిమినల్స్ సాధారణంగా డ్రగ్స్ విషయంలో వెనక్కి తగ్గరు. కానీ, ఈ అత్యంత ప్రమాదకరమైన ఫెంటనిల్ విషయంలో మాత్రం వేరే లెక్కలు వేసుకున్నారు.
ఒకే డ్రగ్… రెండు వేర్వేరు ప్రపంచాలు!
ఒక్కసారి అంతర్జాతీయంగా ఉన్న లెక్కలు చూస్తే మైండ్ షాక్ అవుతుంది. 2024లో ఫెంటనిల్ వాడకం వల్ల ఇటలీ మొత్తంలో నమోదైన మరణాలు కేవలం రెండు మాత్రమే! అదే సమయంలో జర్మనీలో 95 మంది, అమెరికాలో ఏకంగా 48,000 మంది ఈ డ్రగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ యువతలో కొకైన్, ఇతర డ్రగ్స్ వాడకం జర్మనీతో సమానంగా ఉన్నప్పటికీ, ఈ ఫెంటనిల్ మాత్రం అక్కడ అడుగుపెట్టలేకపోయింది. దీనికి కారణం పోలీసుల నిఘా గానీ, ప్రభుత్వాల కఠిన చర్యలు గానీ కావు. ప్రసిద్ధ క్రైమ్ రచయిత రొబెర్టో సవియానో మాటల్లో చెప్పాలంటే, ఇది పోలీసుల విజయం ఎంతమాత్రమూ కాదు… కేవలం ఇటలీ మాఫియాలు విధించిన ‘అన్అఫీషియల్ బ్యాన్’!
కస్టమర్ చస్తే బిజినెస్ గోవిందా… ఇదీ మాఫియా లాజిక్!
ఈ నిర్ణయం వెనుక ఎలాంటి నైతిక విలువలు లేవు, కేవలం క్రూరమైన బిజినెస్ సైకాలజీ మాత్రమే ఉంది. ఫెంటనిల్ ఎంత పవర్ఫులో, ప్రాణాలు తీయడంలో అంతకంటే స్పీడ్. ఒకవేళ కస్టమర్ డోస్ ఎక్కువై చనిపోతే, ఒక కస్టమర్ పోవడమే కాకుండా, పోలీసుల దాడులు పెరుగుతాయి, మీడియా ఫోకస్ అవుతుంది, ప్రతీ ఒక్కరిపై నిఘా మొదలవుతుంది. దాంతో ఇప్పటిదాకా సజావుగా సాగుతున్న కొకైన్, హెరాయిన్ల వేల కోట్ల సామ్రాజ్యం మొత్తం ముక్కలైపోతుంది. అందుకే, “ఒక్కసారిగా కస్టమర్‌ను చంపేసే డ్రగ్ కంటే… అతన్ని మళ్లీ మళ్లీ వచ్చి మన దగ్గరే కొనేలా చేసే డ్రగ్ అమ్మడమే అసలైన బిజినెస్!” అని మాఫియా స్మార్ట్‌గా ప్లాన్ చేసింది.
స్క్రీన్ ప్లే తరహాలో మారుతున్న మాఫియా గేమ్!
అయితే, మాఫియా బాస్‌లంతా ఒకచోట కూర్చుని ఫెంటనిల్‌ను నిషేధించినట్లు ఎలాంటి రాతపూర్వక ఆధారాలూ లేవు. కానీ ఇటలీ ప్రత్యేక ఆర్గనైజ్డ్-క్రైమ్ విభాగం కమాండర్ స్వయంగా పార్లమెంటరీ కమిషన్ ముందు ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ బిజినెస్ లాజిక్ నిజమేనని తేలింది. అయితే ప్రతి క్రైమ్ స్టోరీలోనూ పాత గ్యాంగ్‌లకు చెక్ పెడుతూ కొత్త గ్యాంగ్‌లు ఎంటర్ అవుతుంటాయి. ఇటీవల రోమ్‌లోని ఒక హాస్పిటల్ నుంచి ఏకంగా 20,000 డోసులకు సరిపడే ఫెంటనిల్ సీసాలు మాయమవ్వడం పెద్ద కలకలం రేపింది.
కొకైన్లాగా పెద్ద పెద్ద కంటైనర్లలో సరుకు రవాణా చేయాల్సిన పనిలేకుండా, జేబులో పట్టే చిన్న ప్యాకెట్‌తోనే కోట్లు సంపాదించే ఛాన్స్ ఉండటంతో, కొత్తగా వచ్చే చిన్న చిన్న గ్యాంగులు ఈ డ్రగ్ వైపు ఆకర్షితులవుతున్నాయి. ఒకవేళ వీధి స్థాయిలో ఈ డ్రగ్ డిమాండ్ పెరిగితే… “మా బిజినెస్‌ను ప్రమాదంలో పడేయకండి” అని చెప్పే పాత మాఫియాలకు, “ఇదే మా భవిష్యత్తు” అని గెంటేసే కొత్త కుర్రాళ్లకు మధ్య త్వరలోనే పెద్ద గ్యాంగ్ వార్ జరిగేలా కనిపిస్తోంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








