ఒక పిల్లవాడి కస్టడీ కేసు.. అమెరికా వీసా బాన్ వరకు వెళ్తుందా? కొత్త రూల్ తో జాగ్రత్త!
ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య వివాదం వచ్చింది.
అది చివరకి పెరిగి పెద్దదై విడాకులు దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇదంతా ప్రపంచమంతటా సర్వ సాధారణంగా జరిగే వ్యవహారం. అయితే ఆ దంపతులకు పిల్లలు ఉన్నప్పుడు ‘పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. సాధారణంగానైతే ఇది కేవలం ఒక కుటుంబానికి, స్థానిక కోర్టుకు సంబంధించిన విషయం. కానీ, అదే దంపతుల్లో ఒకరు అమెరికాలో ఉండి, మరొకరు బిడ్డను తీసుకొని భారత్కు వచ్చేస్తే కథ పూర్తిగా మారిపోతుంది. ఒక దేశం నుంచి మరో దేశానికి బిడ్డను తీసుకురావడంతో, అది రెండు దేశాల మధ్య నడిచే అంతర్జాతీయ న్యాయ వివాదంగా రూపాంతరం చెందుతుంది. పిల్లలను భారత్లోనే ఉంచాలా? లేక అమెరికాలోని తల్లిదండ్రి దగ్గరకు పంపాలా? ఇది నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా తేలకుండా సాగే కోర్టు కేసులుగా మారుతూంటాయి. అయితే ఇప్పుడు అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల ఇలాంటి కేసుల్లో మరో కీలక అంశం చేరింది.
అమెరికా తెచ్చిన ఆ కొత్త నిబంధన ఏంటి?
ఇటీవల అమెరికా ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. అంతర్జాతీయ చైల్డ్ కస్టడీ కేసుల్లో పిల్లలను తిరిగి పంపించే ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే విదేశీ అధికారులు, న్యాయమూర్తులు, చట్టాన్ని అమలు చేసే పోలీసులు లేదా న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తులపై వీసా ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది.
అంతేకాదు, అవసరమైతే ఆ అధికారుల తక్షణ కుటుంబ సభ్యులకు కూడా వీసాలు నిరాకరించవచ్చని స్పష్టం చేసింది. భారత్, అమెరికాల మధ్య లక్షలాది మంది ఉద్యోగాలు, వివాహాలు, వలసలతో ముడిపడి ఉన్నారు కాబట్టి, ఈ వార్త రాగానే సహజంగానే అందరిలోనూ రకరకాల అనుమానాలు మొదలయ్యాయి.
భారతీయ తల్లిదండ్రులు నిజంగా భయపడాలా?
ఈ వార్త వినగానే ప్రవాస భారతీయులు లేదా భారతీయ తల్లిదండ్రులు తమ వీసాలు రద్దయిపోతాయేమోనని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది నేరుగా కేసుల్లో ఉన్న తల్లిదండ్రులపై విధించే ఆటోమేటిక్ నిషేధం కాదు. కోర్టు ఆదేశాలనో లేక ప్రభుత్వ విధానాలనో ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి, పిల్లలను తిరిగి పంపే ప్రక్రియను కావాలని ఆలస్యం చేసే లేదా అడ్డుకునే ‘అధికారులను’ లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ నిబంధన తెచ్చింది. అంటే, సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడే వ్యవస్థలోని వ్యక్తులపై ఒత్తిడి పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం.
చట్టాలు, కోర్టుల మధ్య నలిగిపోయే అసలు సమస్య
ఉదాహరణకి… అమెరికాలో ఉన్న ఒక భారతీయ దంపతుల మధ్య గొడవలు వచ్చి, తల్లి బిడ్డను తీసుకుని భారత్కు వచ్చేసింది అనుకుందాం. అక్కడ అమెరికా కోర్టు ఆ పిల్లవాడిని వెంటనే తిరిగి అమెరికా తీసుకరావాలని ఆదేశించవచ్చు. కానీ ఆ ఆర్డర్ భారత్లో వెంటనే అమలు కావడం అంత తేలిక కాదు. ఇక్కడి కోర్టులకు రాగానే విషయం మారుతుంది.
భారతీయ న్యాయస్థానాలు కేవలం విదేశీ కోర్టు తీర్పును గుడ్డిగా అమలు చేయవు. పిల్లవాడి క్షేమం, సంక్షేమం, ఇక్కడి స్థానిక పరిస్థితులు, తల్లిదండ్రుల హక్కులను సమగ్రంగా పరిశీలిస్తాయి. దాంతో అమెరికా దృష్టిలో “వెంటనే పంపించాల్సిన కేస్” కాస్తా, మన దగ్గర “పిల్లవాడి భవిష్యత్తు, సంక్షేమం” అనే పెద్ద ప్రశ్నగా మారుతుంది.
దౌత్యపరమైన ఒత్తిడి నుండి వ్యక్తిగత ఆంక్షల వరకు
ఇంతకుముందు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేశాల మధ్య దౌత్య చర్చలు జరిగేవి, ఆ తర్వాత చట్టపరమైన సంప్రదింపులు నడిచేవి. కానీ ఇప్పుడు అమెరికా ఒక అడుగు ముందుకు వేసి, అధికారులు లేదా నిర్ణయాధికారుల వ్యక్తిగత వీసాలపై దెబ్బకొట్టే సాధనాన్ని చేతిలోకి తీసుకుంది. అయితే ఇక్కడొక పెద్ద సంక్లిష్టత ఉంది. ఒక కేసులో కోర్టు విచారణ ఆలస్యం కావడం వేరు, కావాలని అడ్డుకోవడం వేరు. స్థానిక చట్టాల ప్రకారం విచారణ జరుగుతున్నప్పుడు అయ్యే ఆలస్యాన్ని అమెరికా “ఉద్దేశపూర్వక అడ్డంకి”గా భావిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేని పెద్ద ప్రశ్న.
న్యాయవ్యవస్థల ఘర్షణ… చివరకు జరిగేదేంటి?
ఈ నిర్ణయం వల్ల ఒక పెద్ద అంతర్జాతీయ చర్చ మొదలైంది. ఒక దేశం తన సొంత న్యాయవ్యవస్థ, చట్టాల ప్రకారం నిర్ణయం తీసుకుంటుంటే, మరొక దేశం వీసా ఆంక్షల పేరుతో ఆ వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వస్తున్నాయి. అమెరికా దీనిని పిల్లలను త్వరగా తల్లిదండ్రుల వద్దకు చేర్చే ఒక మార్గంగా చూస్తుంటే, ఇతర దేశాలు దీనిని తమ సార్వభౌమాధికారంపై, న్యాయవ్యవస్థపై తీసుకొచ్చే ఒత్తిడిగా భావించే అవకాశం ఉంది.
ఈ గొడవలన్నింటిలో తల్లిదండ్రులు తమ హక్కుల కోసం, దేశాలు తమ చట్టాల కోసం, కోర్టులు తమ పరిధుల కోసం పోరాడుతుంటాయి. కానీ వీటన్నింటి మధ్య నలిగిపోయేది మాత్రం ఒక చిన్న పిల్లవాడు. అందుకే ఇలాంటి సున్నితమైన కేసుల్లో ఎవరు గెలిచారనే దానికంటే, ఆ పిల్లవాడి భద్రత, భవిష్యత్తును కాపాడటమే అందరి మొదటి ప్రాధాన్యం కావాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








