పూరీ క్లారిటీ ఇవ్వడమే బెటర్!
హనుమాన్(Hanuman) నిర్మాత చైతన్య రెడ్డి(Chaitanya Reddy) చేసిన తాజా కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. డబుల్ ఇస్మార్ట్(Double Ismart) థియేట్రికల్ రైట్స్ వ్యవహారంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannadh), ఛార్మి(Charmee)పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమా రిలీజ్ కు ముందు రైట్స్ కు పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో తాము ముందుకొచ్చి ప్రాజెక్ట్‌కు అండగా నిలిచామని చైతన్య రెడ్డి పేర్కొన్నారు. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆమె చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తమకు గతంలోనే ఉన్న లైగర్(liger) బకాయిలను డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు ముందే పరిష్కరించాలని పూరి, ఛార్మిని కోరినట్లు చైతన్య రెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఆ బకాయిలు చెల్లించలేదని, సినిమా రిలీజ్ తర్వాత తమతో సంప్రదింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు. ఫోన్ నంబర్లు మార్చుకోవడం, సమస్య పరిష్కారం కోసం ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకోవాల్సి రావడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. ఈ డీల్ నుంచి తప్పుకోవాలని పలువురు పరిశ్రమ ప్రముఖులు సూచించినా తాము ముందుకు వెళ్లినట్లు వెల్లడించారు.
లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ ఎదుర్కొన్న బకాయిల వివాదం నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ వ్యవహారంపై వచ్చిన ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే చైతన్య రెడ్డి చేసిన ఆరోపణలపై పూరి జగన్నాథ్, ఛార్మి నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రావాల్సి ఉంది. ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పూరీ కెరీర్లో ఇలాంటి ఆర్థిక వివాదాలు డిస్కషన్‌కు రావడం ఇదే తరహాలో కొనసాగుతుండటంతో, ఈ వ్యవహారంపై ఆయన వివరణ ఇవ్వడం కీలకంగా మారింది.








