SIR: 44 లక్షల ఓట్లపై ఇంకా గందరగోళమే!
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన పెద్ద సవాల్ గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. నోటీసుల పరిధిలోని 92.8 లక్షల మంది ఓటర్లలో ఇప్పటివరకు 46.88 లక్షల మంది వెరిఫికేషన్ పూర్తి చేసుకుని తుది జాబితాకు అర్హత సాధించారు. అయితే ఇంకా దాదాపు 44 లక్షల మంది ఓటర్ల భవితవ్యం ఇంకా డైలమాలోనే ఉంది.
ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం, ఎస్ఐఆర్ ప్రక్రియలో మొత్తం 92.8 లక్షల నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో 88.5 లక్షల నోటీసులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు చేరగా, మరో 4.3 లక్షల నోటీసుల పంపిణీ ఇంకా పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు 61.87 లక్షల కేసుల్లో విచారణలు పూర్తవగా, అందులో 46.88 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
ఈ 92.8 లక్షల నోటీసుల జాబితాను పరిశీలిస్తే.. 60.5 లక్షల మంది ఓటర్ల వివరాల్లో లాజికల్ లోపాలు ఉన్నాయి. మరో 32.3 లక్షల మంది పేర్లు మునుపటి ఎస్ఐఆర్ జాబితాలతో మ్యాపింగ్ కాలేదు. వీరు కాకుండా, ఇప్పటికే ఆగస్టు 17న విడుదలైన ముసాయిదా జాబితా నుంచి గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన, నకిలీ ఓట్లు.. తదితర కారణాలతో 73.39 లక్షల పేర్లను పక్కనపెట్టారు.
చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములు కేవలం ఒకటి లేదా రెండు వేల ఓట్ల స్వల్ప తేడాతోనే నిర్ణయమవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో వేలాది ఓట్లపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్లు కాదని, ఓటర్లు స్పందించి పత్రాలు సమర్పించాలని సీఈవో స్పష్టం చేస్తున్నారు. గడువులోగా స్పందించకపోతే ఈ 44 లక్షల మందిలో మెజారిటీ ఓట్లు రద్దయ్యే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా పట్టణాలు, కాలనీలు, మురికివాడలు, వలస కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తమ సంప్రదాయ ఓటు బ్యాంకులను ప్రత్యర్థి పార్టీలు కుట్రపూరితంగా జాబితా నుంచి గల్లంతు చేయిస్తున్నాయా లేక అధికార యంత్రాంగం తొందరపాటు వల్ల అర్హులైన ఓటర్లు హక్కు కోల్పోతున్నారా అనే అనుమానాలతో రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నాయి.
ఓటర్లలో నెలకొన్న ఆందోళనలు, రాజకీయ పక్షాల నుంచి వచ్చిన వినతులను దృష్టిలో ఉంచుకుని సీఈవో సుదర్శన్ రెడ్డి సెప్టెంబర్ 28న అధికారులకు సరికొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. మ్యాపింగ్ లేనివారు, లాజికల్ లోపాలు ఉన్న ఓటర్లను నేరుగా ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి పత్రాలు సేకరించి, ఈసీఐ నెట్ ద్వారా అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. విచారణలు కేవలం అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే, వీలైనంత వరకు ఆన్లైన్ విధానంలోనే జరపాలని, అవసరమైతే ఓటరు తరఫున కుటుంబసభ్యులు హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. శ్రామికులు, బలహీన వర్గాల ఓట్లు గల్లంతు కాకుండా జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక క్యాంపులు, హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఓటర్ల జాబితా పారదర్శకత ప్రజాస్వామ్య మనుగడకు ఎంత అవసరమో, సాంకేతిక కారణాలతో ఏ ఒక్క నిజమైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చూడటం అంతకంటే ముఖ్యం. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 44 లక్షల ఓటర్ల పరిష్కార ప్రక్రియే రాబోయే ఎన్నికల ఫలితాల దిశను నిర్దేశించనుంది. అందుకే అటు ఎన్నికల యంత్రాంగం పారదర్శకతతో వ్యవహరించాల్సి ఉండగా, ఇటు రాజకీయ పార్టీలు కూడా కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తమ ఓటర్లను కాపాడుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.








