సాగునీటి ప్రాజెక్టుల్లో ఆర్మీ సేవలు.. రేవంత్ సర్కార్ సరికొత్త వ్యూహం!
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పునరుద్ధరణ పనులలో ఆర్మీ ఇంజనీర్ల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిప్పుడు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) తవ్వకం పనులు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (KLIP) లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనుల కోసం ముగ్గురు ఆర్మీ అధికారులను డిప్యుటేషన్‌పై కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్లతో జరిగిన చర్చల అనంతరం ముగ్గురు ఆర్మీ అధికారులను రాష్ట్రానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీలలో కుంగిపోవడాలు, లీకేజీలు వంటి సాంకేతిక లోపాలు తలెత్తాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికల తర్వాత వీటిని పునరుద్ధరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. మరోవైపు దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన, సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో జాప్యం, ఇంజనీరింగ్ అడ్డంకులు, నాణ్యతా లోపాలు ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో పనుల్లో మిలటరీ స్థాయి క్రమశిక్షణ, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, జవాబుదారీతనం, పకడ్బందీ భద్రతా ప్రమాణాలు, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసే మిషన్-ఓరియెంటెడ్ అప్రోచ్ అవసరమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. కఠినమైన సొరంగ తవ్వకాలలో అసాధారణ అనుభవం ఉన్న ఆర్మీ ఇంజనీర్ల సేవలను వాడుకోవడం ద్వార ప్రాజెక్టులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.
ఇవి కూడా చదవండి
కేంద్రం కేటాయించిన ముగ్గురు నిపుణులైన ఆర్మీ అధికారులను అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతాలలో మోహరించనున్నారు. దాదాపు 44 కిలోమీటర్ల పొడవైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఇంకా 9 కిలోమీటర్ల పనులు పూర్తి కావాల్సి ఉంది. రెండు తవ్వకపు సొరంగాల వద్ద ఆపరేషన్లను ఒక ఆర్మీ అధికారికి అప్పగించనున్నారు. 2028 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అడ్వాన్సడ్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్, వెంటిలేషన్, భద్రతా వ్యవస్థలను పర్యవేక్షించడంలో ఈ అధికారుల సేవలు కీలకం కానున్నాయి.
ఇక మిగిలిన ఇద్దరు ఆర్మీ అధికారులను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు కేటాయించనున్నారు. ఐఐటీ బొంబాయి, AFRY ఇండియా వంటి సంస్థల నిపుణుల సిఫారసులు, నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు భౌగోళిక పరీక్షలు, కాంక్రీట్, ఫౌండేషన్ టెస్టులను నిర్వహించి.. ఫైనల్ డిజైన్లను అమలు చేయడంలో వీళ్లు గైడ్ చేస్తారు.
ఆర్మీ అధికారుల సేవలను వాడుకోవడం వెనుక రాజకీయ కోణం కూడా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, నాణ్యతా లోపాలు జరిగాయని ఆరోపిస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం ఏకంగా ఆర్మీ అధికారులను రంగంలోకి దించడం ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్ ని రాజకీయంగా ఇరుకున పెట్టాలని చూస్తోంది. రాష్ట్ర ఇంజనీరింగ్ వ్యవస్థపై, స్థానిక కాంట్రాక్టర్లపై భారం మోపితే పనుల్లో పారదర్శకత లోపించవచ్చనే భావనతో పాటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ఆర్మీ అధికారుల పర్యవేక్షణ ఉంటే పనుల్లో నాణ్యతతో పాటు రాజకీయంగా కూడా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టవచ్చనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది.








