సిలికాన్ వ్యాలీలో కీచక పర్వం..విస్పర్ నెట్ వర్క్ జాబితా కలకలం..
ప్రపంచ టెక్నాలజీ రాజధాని సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. వంద మందికి పైగా పేర్లతో కూడిన ఓ రహస్య జాబితా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం వెల్లడించింది.
మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడటం నుంచి అత్యాచారం వరకు పలు తీవ్రమైన ఆరోపణలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. బాధితులు, ఇతర మహిళలు ఒకరినొకరు అప్రమత్తం చేసుకునేందుకు ఈ సమాచారాన్ని రహస్యంగా పంచుకుంటున్నట్లు కథనం పేర్కొంది.
విస్పర్ నెట్ వర్క్…
సిలికాన్ వ్యాలీలో ఈ సమాచార మార్పిడిని ‘విస్పర్ నెట్వర్క్’గా పిలుస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి మహిళలు పరస్పరం హెచ్చరించుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రముఖుల పేర్లు చూసి ఆశ్చర్యపోయానని ఓ టెక్ ఉద్యోగిని తెలిపింది. తనకు ఎదురైన వేధింపుల అనుభవాన్ని కూడా అందులో నమోదు చేసినట్లు చెప్పింది. పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందే ప్రయత్నంలో విఫలమైతే, పెట్టుబడిదారులు తనను దూరం పెడతారనే భయం ఉందని వివరించింది.
హ్యాకర్ హౌస్ లోనూ..
సిలికాన్ వ్యాలీలో యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కలిసి నివసించే ‘హ్యాకర్ హౌస్’ల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత పరిచయాలు, స్నేహాల ద్వారా నమ్మకం పెంచుకుని కొందరు మహిళల హద్దులను దాటుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇటీవల అమెరికాకు వచ్చినవారు, ఒంటరిగా ఉండేవారు లక్ష్యంగా మారుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
‘జెట్టే’ యాప్ వ్యవస్థాపకురాలు యెహోంగ్ ఝూ కూడా తనకు ఎదురైన అనుభవాన్ని బహిరంగంగా వెల్లడించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని జెనెసిస్ హ్యాకర్ హౌస్కు చెందిన ఓ వ్యక్తిపై అత్యాచారం, దాడి ఆరోపణలు చేశారు. 2021 డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఆ వ్యక్తి ఆచూకీ లభించలేదని తెలిపారు. ఇంటి నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.
గతంలోనూ వెలుగులోకి..
టెక్ వర్గాల్లో లైంగిక వేధింపులు, ఫిర్యాదుల పరిష్కారంపై గతంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 2022లో కృత్రిమ మేధ పరిశోధకురాలు కీర్తన గోపాలకృష్ణన్.. ఎఫెక్టివ్ ఆల్ట్రూయిజం వర్గాల్లో లైంగిక ఒత్తిళ్ల గురించి రాశారు. లైంగిక దాడుల ఫిర్యాదుల పరిష్కారానికి సమాజంలోని వ్యక్తుల మధ్యవర్తిత్వం సరిపోతుందా? అనే ప్రశ్నను లేవనెత్తారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆరోపణలు.. టెక్ రంగంలోని సన్నిహిత వృత్తిపరమైన సంబంధాల్లో భద్రత, ఫిర్యాదుల పరిష్కారంపై మరోసారి చర్చకు దారితీశాయి.








