అమెరికా-ఇరాన్ పోటాపోటీ బౌంటీలు..!
పశ్చిమాసియా యుద్ధంలో గెలుపే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను వాడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా యుద్ధరంగంలో తమకు కొరకరాని కొయ్యలుగా ఉన్న వారిని హతమార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో ముఖ్యమైంది బౌంటీ. అంటే.. ఎవరైతే వారికి మోస్ట్ వాంటెడ్ గా ఉంటారో.. వారిని పట్టిచ్చినా, వారికి సంబంధించి కీలక సమాచారం అందించినా.. కోట్లలో నజరానా అందిస్తారన్న మాట. ఇప్పుడు ఈ బాటలో ముందుకెళ్తున్నాయి రెండు దేశాలు.
గల్ఫ్ దేశాలలోని తమ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్న ముగ్గురు కీలక ఐఆర్జీసీ (IRGC) ఏరోస్పేస్ ఫోర్స్ నాయకుల సమాచారం చెబితే 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.143 కోట్లు) బహుమతి ఇస్తామని అగ్రరాజ్యం (USA) ప్రకటించింది. వారి పేర్లను బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా మెహ్రాబీ, అహ్మద్ జాఫరాబాది, అలీ అస్గర్ నౌరూజీగా పేర్కొంది. రివార్డుతో పాటు పునరావాసాన్ని కూడా కల్పించనున్నట్లు తెలిపింది.
మరో వైపు అమెరికా సైనికులను చంపితే 5 బిలియన్ టోమన్లు (దాదాపు రూ.11కోట్లు) ఇస్తామని ఇరాన్ (Iran) సైన్యం ఆఫర్ చేసింది. టెహ్రాన్‌పై వాషింగ్టన్ భారీ దాడులకు ప్రణాళిక చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా భూతల దాడులు చేపడితే.. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించే అమెరికా సైనికులను చంపినా లేదా పట్టుకున్న పౌరులకు ఈ రివార్డు ఇస్తామని ఇరాన్ సైన్య ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమీనియా ప్రకటించారు.
అమెరికా సైనికులను పురుషుడు కాకుండా మహిళ బంధిస్తే.. రెట్టింపు బహుమతి ఇస్తామన్నారు. ప్రపంచ దేశాలకు చెందిన ప్రజలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. అంతే కాకుండా అమెరికా సైనికులను పట్టుకోవడానికి లేదా చంపడానికి ఉపయోగించిన ఆయుధాలను రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.








