ఏఐ అకార్డ్ ఆవిష్కరణ..ట్రంప్ కీలక చర్య..!
ఓవైపు ఏఐ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు.. పరీక్షా సమయంలోనే ఏఐ మోడల్స్ కట్టుతప్పి ప్రవర్తిస్తున్న దాఖలాలు భయపెడుతున్నాయి. ఈతరుణంలో ఏఐ స్పీడ్ తగ్గించాలని ప్రపంచ టెక్ దిగ్గజాలు పిలుపునిచ్చిన సందర్భాన్ని చూశాం. అయితే దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఏకంగా ఆ దిగ్గజాలతోనే ఓ ఏఐ అకార్డ్ ఏర్పాటు చేశారు. ఫలితంగా ఇక ఏఐ మోడల్స్ కట్టుతప్పి.. భవిష్యత్ లో ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంటాయన్న అనుమానాలు తొలగిపోనున్నాయి.
ఏఐ మోడల్స్ అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్‌లో ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ‘ఏఐ అకార్డ్’ను ఆవిష్కరించారు. దీంతో ఏఐని అదుపులో పెట్టే నైతిక బాధ్యతను అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్వచ్ఛందంగా తీసుకున్నట్లయింది. ఈ ఒప్పందం కింద టెక్ కంపెనీలు తమంతట తామే ఐటీ భద్రతను సమీక్షించుకుంటాయి. అలాగే అంతర్గత, బాహ్య తనిఖీలు నిర్వహించేందుకు వీలు కలగనుంది.
ఏఐ సాంకేతికత (Artificial Intelligence) అభివృద్ధిని అమెరికా ప్రభుత్వం నియంత్రించదని, అడ్డుకోదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ రంగాన్ని ‘‘సూపర్ ఇంటెలిజెన్స్’’ అని పిలవాలని పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ సమాచారం, సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ట్రంప్ America.gov సైట్‌ను ఆవిష్కరించారు. ఇది ఏఐ సాంకేతికతతో నడుస్తుంది. ఈ సైట్లో ఓ విభాగం యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. కొన్ని సమాధానాలు ట్రంప్ ప్రటనలకు భిన్నంగా ఉన్నాయి. ఓ ప్రశ్నకు.. ఎప్స్టీన్ పైళ్లలో ట్రంప్ పేరు ఉందని సమాధానం ఇచ్చింది. తర్వాత వెంటనే సైట్ తన సమాధానాలను సవరించుకుంది.








