ఉక్రెయిన్ ఆపరేషన్ వివాల్డీ.. రష్యాను వణికిస్తున్న మానవరహిత వాహనాలు..
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ సరికొత్త అస్త్రాన్ని బయటకు తీసింది. అదే ఆపరేషన్ వివాల్డీ. దీనిలో భాగంగా సోవియెట్ కాలం నాటి పాత వాహనాలను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి.. రష్యా సైనికులను ఉక్రెయిన్ దళాలు బంధిస్తున్నాయి. (Ukraine-Russia War) ఈ పరిణామం రష్యన్ సేనలను వణికిస్తోంది. ఎటు నుంచి ఏ వెహికిల్ వచ్చినా.. అది ఎలాంటి మృత్యువాహనమో అర్థం కాక.. అయోమయంలో పడుతున్నాయి క్రెమ్లిన్ సేనలు.
రష్యా (Russia) ఆక్రమణలో ఉన్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ (Ukraine) ఇటీవల ‘ఆపరేషన్ వివాల్డీ’ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆక్రమిత నోవ్ ప్రాంతంలో ఉన్న రష్యా స్థావరాలపైకి మానవరహిత వాహనాలను పంపించింది. సోవియట్ కాలం నాటి బీటీఆర్-60 వాహనాలను సెల్ఫ్ డ్రైవింగ్ కార్లుగా మార్చి అందులో పేలుడు పదార్థాలను అమర్చింది. మాస్కో స్థావరాల వద్దకు చేరుకోగానే వాటిని పేల్చేసింది. దీంతో అక్కడ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, నియంత్రిత వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత ఉక్రెయిన్ దళాలు ఈ స్థావరంపైకి దండెత్తి.. 250 మంది మాస్కో సైనికులను బంధించాయి.
ఈ ఆపరేషన్‌ను ఉక్రెయిన్‌కు చెందిన థర్డ్ ఆర్మీ కోర్ దళం నిర్వహించింది. దీనికి బ్రిగేడియర్ జనరల్ ఆండ్రీ బిలెట్స్కీ సారథ్యం వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను థర్డ్ ఆర్మీ దళం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ ఆపరేషన్‌తో నోవ్ ప్రాంతంలోని రష్యన్ యూనిట్ మొత్తం లొంగిపోయిందని ఆండ్రీ తెలిపారు. వీరిని ఉపయోగించుకుని రష్యా చెరలో ఉన్న ఉక్రెయిన్ సైనికులను విడిపించుకుంటామని పేర్కొన్నారు. ఆపరేషన్ వివాల్డీతో.. నోవ్తో పాటు మరో రెండు గ్రామాలకు స్వేచ్ఛ కల్పించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌తో ఇప్పటివరకు 68 చదరపు మైళ్ల భూభాగాన్ని రష్యా దళాల నుంచి ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ అధ్యయన సంస్థల గణాంకాల ప్రకారం.. ఇంకా దాదాపు 45వేల చదరపు మైళ్ల భూభాగం మాస్కో సైన్యం ఆధీనంలోనే ఉందని అంచనా. ఉక్రెయిన్ మొత్తం భూభాగంలో ఇది 20శాతానికి సమానం కావడం గమనార్హం.








