స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నయా ఫోకస్..!
రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన(Janasena) అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పార్టీ అంతర్గత నిర్మాణంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామ మరియు మండల స్థాయిల్లో కూటమి అభ్యర్థుల గెలుపును సుగమం చేసేందుకు వీలుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త సమన్వయ కమిటీలను రంగంలోకి దించబోతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లడం, స్థానిక లీడర్లతో సమన్వయం చేసుకోవడం ఈ నూతన కమిటీల ప్రధాన బాధ్యత కానుంది.
కొత్త కమిటీల ఏర్పాటులో భాగంగా పవన్ కల్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో 25 మంది సభ్యులతో నియమించిన పాత పార్లమెంట్ కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసే యాక్టివ్ లీడర్లకు ఈ కొత్త కమిటీలలో పెద్దపీట వేయనున్నారు. అయితే, గతంలో నియమించిన ప్రచార కమిటీలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలలో సాధించిన చారిత్రాత్మక విజయ పరంపరను స్థానిక సంస్థల ఎన్నికలలోనూ కొనసాగించాలని జనసేన పట్టుదలగా ఉంది. ఈ నూతన కమిటీల ద్వారా అటు తెలుగుదేశం, బీజేపీ కూటమి ధర్మాన్ని నిలబెడుతూనే.. ఇటు క్షేత్రస్థాయిలో జనసేన బలాన్ని మరింత సుస్థిరం చేయాలని చూస్తోంది. పాత కమిటీల రద్దు, సరికొత్త బాధ్యుల నియామకంతో జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. రాబోయే కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీల సభ్యుల అధికారిక జాబితా విడుదల కానుంది.








