ఈబీ-5 చార్జీలు రెట్టింపు.. ట్రంప్ సర్కార్ మరో నియంత్రణ చర్య…!
అమెరికా గ్రీన్ కార్డు మరింత ప్రియంగా మారుతోంది. హెచ్-1బీ వీసాదారులపై ఇప్పటికే చాలా కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు ఆదేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సాధించుకునే గ్రీన్ కార్డ్ పైనా కన్నేసింది.భారతీయ పారిశ్రామికవేత్తలు, కుటుంబాలు ఎక్కువగా ఆసక్తి చూపే ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ఫీజులను భారీగా పెంచుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఫీజుల నిబంధనను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మంగళవారం ఖరారు చేసింది. నూతన ఫీజులు ఈ ఏడాది నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈబీ-5 ప్రోగ్రామ్?
అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా 1990లో ఈబీ-5 ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ పథకం కింద విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలోని వాణిజ్య సంస్థలలో నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడి పెట్టి, కనీసం 10 మంది అమెరికన్లకు పూర్తికాల ఉద్యోగాలు కల్పించాలి.
ప్రస్తుతం ఈ పెట్టుబడి మొత్తం అర్హత కలిగిన వ్యాపారంలో 1.05 మిలియన్ డాలర్లుగా, టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో అయితే 8 లక్షల డాలర్లుగా ఉంది. ఈ నిబంధనలు పాటిస్తే, పెట్టుబడిదారుడు, వారి జీవిత భాగస్వామి, అర్హులైన పిల్లలు గ్రీన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
భారీగా పెరిగిన ఫీజులు ..
యూఎస్సీఐఎస్ తాజా నిర్ణయంతో దరఖాస్తు ఫీజులు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. సాధారణ ఇన్వెస్టర్లు దాఖలు చేసే ఫారం I-526 ఫైలింగ్ ఫీజు 3,675 డాలర్ల నుంచి 7,615 డాలర్లకు పెరిగింది
రీజనల్ సెంటర్ల ద్వారా పెట్టుబడి పెట్టేవారు ఉపయోగించే ఫారం I-526E ఫీజు 3,675 డాలర్ల నుంచి 7,850 డాలర్లకు చేరింది. ఈ రెండు ఫారాలకు అదనంగా 75 డాలర్ల టెక్నాలజీ ఫీజు చెల్లించాలి.
గ్రీన్ కార్డ్‌పై ఉన్న షరతులను తొలగించుకోవడానికి దాఖలు చేసే ఫారం I-829 ఫీజు 3,750 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరిగింది.
రీజనల్ సెంటర్ల కోసం దరఖాస్తు చేసుకునే ఫారం I-956 ఫీజు 17,795 డాలర్ల నుంచి ఏకంగా 44,115 డాలర్లకు పెరిగింది. పెట్టుబడి ప్రాజెక్టు ఆమోదం కోసం ఉపయోగించే ఫారం I-956F ఫీజు 17,795 డాలర్ల నుంచి 42,675 డాలర్లకు పెరిగింది. అయితే, ఫారం I-956G వార్షిక ఫీజును 3,035 డాలర్ల నుంచి 2,165 డాలర్లకు తగ్గించడం గమనార్హం.
ఫీజుల పెంపు వెనక….!
ఫీజుల పెంపుపై యూఎస్సీఐఎస్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. తమ ఏజెన్సీకి ప్రభుత్వ పన్నుల ద్వారా కాకుండా, దరఖాస్తుదారులు చెల్లించే ఫీజుల ద్వారానే అధికశాతం నిధులు సమకూరుతాయని స్పష్టం చేసింది. దరఖాస్తుల సమీక్ష, నేపథ్య పరిశీలన, అర్హత నిర్ధారణ, మోసాల గుర్తింపు, కార్యక్రమ నిర్వహణ వంటి ఖర్చులను భరించేందుకే ఈ పెంపు తప్పనిసరైందని తెలిపింది.
భారతీయులపై ఎఫెక్ట్
గత దశాబ్దకాలంగా భారత్ నుంచి ఈబీ-5 వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరిగి, గ్రీన్ కార్డ్ కోసం వేచి చూసే సమయం కూడా ఎక్కువైంది. తాజా ఫీజుల పెంపుతో ఈ మార్గంలో అమెరికా వెళ్లాలనుకునే భారతీయ పెట్టుబడిదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.








