కాంగ్రెస్లోకి జగన్ రీ-ఎంట్రీ.. భట్టి హాట్ కామెంట్స్!
దక్షిణాది రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒక సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరతారనే ప్రచారం జోరందుకుంది. దీనికి మరింత బలం చేకూరుస్తూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కొచ్చి వేదికగా జరిగిన ‘ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2026’ కార్యక్రమంలో భట్టి విక్రమార్క ఈ అంశంపై స్పందించారు.
గతంలో పార్టీని వీడి వెళ్లిన వైఎస్ జగన్, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి సీనియర్ నేతలంతా తిరిగి సొంత గూటికి రావాలని భట్టి విక్రమార్క బహిరంగంగానే పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ కుటుంబంతో తమకు సైద్ధాంతిక బంధం ఉందని చెప్పకనే చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ను వీడి సొంత కుంపట్లు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీల అధినేతలను మళ్లీ ఏకతాటిపైకి తెచ్చేందుకు హైకమాండ్ లోపల ఏదైనా ముమ్మర కసరత్తు జరుగుతోందా అనే అనుమానాలు ఈ పరిణామంతో బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్కు, జాతీయ స్థాయిలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నాయనే ఊహాగానాలకు ఈ కామెంట్స్ ఆజ్యం పోశాయి.
ఇక.. సీఎం రేవంత్ రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నేతలను కులాల కోణంలో చూడకూడదని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే తమ ధ్యేయమని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ చెల్లిస్తున్న ప్రతి రూపాయి పన్నుకు బదులుగా రాష్ట్రానికి కేవలం 43 పైసలు మాత్రమే అందుతున్నాయని, ఇది సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవడమేనని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష ఆర్థిక అసమానతలకు దారితీస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని, ఇవి అధికార బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని భట్టి ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలను భట్టి గట్టిగా సమర్థించుకున్నారు. విపక్షాలు విమర్శిస్తున్నట్లు ఇవి కేవలం ఉచితాలు కావని, నిరుపేదలకు ఆత్మగౌరవాన్ని అందించడంతో పాటు వారి కొనుగోలు శక్తిని పెంచే ఆర్థిక సాధనాలని ఆయన వివరించారు. ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్లినప్పుడే మార్కెట్ డిమాండ్ పెరిగి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన ఆర్థిక కోణాన్ని విశ్లేషించారు.








