సామాజిక న్యాయం కాదు.. గెలుపే ముఖ్యం!
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ రెండు పట్టభద్రుల స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డిలను బరిలోకి దింపింది. అయితే, ఈ రెండు కీలక స్థానాలను కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
సాంప్రదాయంగా రాజకీయ పార్టీలు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తామని చెప్తుంటాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మినహాయింపేమీ కాదు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది. ‘గెలుపు గుర్రాల’ వ్యూహానికే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి గట్టి ఆశావహులు రేసులో ఉన్నప్పటికీ, పార్టీ హైకమాండ్ మాత్రం అభ్యర్థుల గెలుపు సామర్థ్యానికే ప్రాధాన్యతనిచ్చింది.
ఈ రెండు స్థానాల పరిధి చాలా విశాలమైనది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గం పరిధిలో దాదాపు 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గం కింద 53 అసెంబ్లీ స్థానాలు విస్తరించి ఉన్నాయి. ఇంతటి భారీ భౌగోళిక ప్రాంతంలో పట్టభద్రుల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, విస్తృతమైన క్యాంపెయిన్ నెట్వర్క్ను నిర్మించడం అధికార పార్టీకి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా బలమైన పట్టున్న నేతల వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆరు జిల్లాల పరిధిలో మెజారిటీ స్థానాల్లో రెడ్డి ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపితే స్థానిక నాయకత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందనే అంచనా పార్టీలో ఉంది.
ఇవి కూడా చదవండి
అయితే, ఈ నిర్ణయం పార్టీలోని ఇతర సామాజిక వర్గాల నాయకుల్లో నిరాశకు గురిచేసిందనే వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ వంటి అగ్రనేతలు పరిశీలించిన పేర్లలో వివిధ వర్గాల అభ్యర్థులు ఉన్నప్పటికీ, చివరికి గెలుపు సమీకరణాల లెక్కలే ముందంజలో నిలిచాయి. దీనిని కవర్ చేయడానికి పార్టీ నాయకత్వం భవిష్యత్తులో రాబోయే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులలో ఇతర సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామనే సంకేతాలు ఇస్తోంది. ప్రస్తుత గ్రాడ్యుయేట్ పోరులో మాత్రం పూర్తిగా ‘విన్నింగ్ థియరీ’ పాటించినట్లు సర్దిచెప్తోంది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ కు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీ అభ్యర్థులే దొరకలేదా అని ప్రశ్నించారు. అణగారిన వర్గాలను అణచివేసే కుట్ర దాగి ఉందన్నారు. మరోవైపు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. రెడ్ల పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ.. రెడ్లకు కాకుండా ఇతర వర్గాలకు టికెట్లు ఇస్తుందని నమ్మగలమా.. అని ఎద్దేవా చేశారు. రెడ్లకు టికెట్లు కేటాయించడం వెనుక బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిందన్నారు.
ఏది ఏమైనప్పటికీ, ప్రతిష్టాత్మకంగా మారిన ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో పార్టీ పట్టును మరింత బిగించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందనేది రానున్న ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.








