వేరే పని చూసుకోండి.. వైసీపీకి లోకేష్ కౌంటర్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటనపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అత్యంత ఘాటుగా స్పందించారు. చంద్రబాబు రహస్య పర్యటనకు వెళ్లారంటూ, ఆయన ఎక్కడికి వెళ్లారో చెప్పాలంటూ విపక్ష నేతలు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వేసిన ప్రశ్నకు లోకేష్ ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి తన కుటుంబంతో గడిపే వ్యక్తిగత సమయాన్ని కూడా విపక్షం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
అసలు ఏం జరిగిందంటే.. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారనే అంశంపై విపక్ష నేతలు పలు రకాల ప్రచారాలు చేశారు. ఆయన వియత్నాం లేదా ఇతర దేశాలకు వెళ్లారంటూ కథనాలు అల్లడమే కాకుండా, ప్రజల కళ్లెదుట నుండి సీఎం మాయమయ్యారంటూ ట్వీట్లు పెట్టారు. దీనికి క్లారిటీ ఇస్తూ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. “ఇద్దరు గ్రాండ్పేరెంట్స్ తమ మనవడితో కలిసి ఓ చిన్న ఫ్యామిలీ హాలిడే కోసం వీకెండ్ ట్రిప్ వెళ్లారు. ఒక దిక్కుమాలిన రాజకీయ పార్టీ అప్పటినుంచి దీని గురించే పదే పదే ఆలోచిస్తూ విమర్శలు చేస్తోంది. దయచేసి వేరే పనేదైనా చూసుకోండి” అంటూ ఇంగ్లీష్ లో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
వ్యక్తిగత జీవితానికి, రాజకీయాలకు కనీస వ్యత్యాసం తెలియకుండా ప్రతి చిన్న విషయాన్ని వివాదాస్పదం చేయడం విపక్షానికి అలవాటుగా మారిందని తెలుగుదేశం పార్టీ (TDP) వర్గాలు మండిపడుతున్నాయి. గతంలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన తరుణంలోనూ కుటుంబంతో కలిసి విశ్రాంతి కోసం విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ప్రజా పరిపాలనలో నిరంతరం బిజీగా ఉండే ముఖ్యమంత్రికి ఈ చిన్న విరామం అవసరమని నేతలు సమర్థిస్తున్నారు. లోకేష్ ఇచ్చిన ఈ సింగిల్ స్టేట్మెంట్ కౌంటర్ తో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై వైసీపీ చేస్తున్న నెగెటివ్ ప్రచారాలకు ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయింది.








