‘‘సేవ్ డెమోక్రెసీ’’ పేరుతో ఇండియా కూటమి దేశ వ్యాప్త నిరసనలు
న్యూఢిల్లీ : ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు, మార్చ్ చేపట్టాలని విపక్ష నేతలు నిర్ణయించారు. బుధవారం న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
అక్టోబర్ 6న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాదయాత్ర చేపట్టబోతున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ నిరసన గురించి వివరిస్తామని చెప్పారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
అలాగే అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరనున్నట్లు కూడా ప్రకటించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను, ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఏరకంగా చేస్తుందో రాష్ట్రపతికి వివరిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞనేష్ కుమార్ దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మండిపడ్డారు.”మేము చాలా మంచి చర్చ జరిపాము. ఓట్ల అపహరణే ప్రధాన సమస్య. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై బీజేపీ, నరేంద్ర మోదీ, అమిత్ షా మరియు జ్ఞనేష్ కుమార్ దాడి చేశారన్నదే అన్ని పార్టీల అభిప్రాయం. దీనిని మేము ఊరికే వదిలిపెట్టబోము. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారికి శిక్ష పడేలా చూస్తాము,” అని ఆయన అన్నారు.








